Ivermectin – A Potential Lifesaver for coronavirusకరోనా రక్కసి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1,203,959 కేసులు నమోదు అయ్యాయి. అలాగే 64,788 మంది మృత్యువాత పడ్డారు. దీనితో ఈ వైరస్ సంహరించే ఔషధం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో పరిశోధనలు ఆరంభించారు.

ఇది ఇలా ఉండగా… ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన కొంత ఆశ చిగురింపచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే… పారాసైట్స్ నుండి సంక్రమించే వ్యాధులు నయం చేసేందుకు ఉపయోగించే యాంటీ పారాసైటిక్ డ్రగ్ ఐవర్ మెక్టిన్ (Ivermectin) కరోనా వైరస్ ను పూర్తిగా నాశనం చేస్తోందని మోనాష్ వర్సిటీ పరిశోధకుడు కైలీ వాగ్ స్టఫ్ తెలిపారు.

పరిశోధన కోసం వేరు చేసిన కణాల్లో పెరుగుతున్న కరోనా సూక్ష్మక్రిమిని 48 గంటల్లో చంపేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ డ్రగ్ తో క్లినికల్ ట్రయల్స్ జరిపితే కరోనా చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్క దోసుతోనే 24 గంటల వైరస్ తగ్గుముఖం పట్టడం, అలాగే 48 గంటలలో వైరస్ ఆర్ఎన్ఏ పూర్తిగా కిల్ కావడం జరుగుతుందని వారు చెప్పారు.

క్లినికల్ ట్రయల్స్ లో గనుక ఇది సక్సెస్ అయితే మానవాళికి ఇది శుభవార్త అనే చెప్పుకోవాలి. ఇది ఇలా ఉండగా .. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,374 గా ఉంది. అనధికారిక సంఖ్యలు 3700 కంటే ఎక్కువ ఉండొచ్చని అంటున్నారు.