its better to follow mahesh babu‘రీమేక్’ సినిమాలకు మహేష్ బాబు ఎంత దూరంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా మహేష్ నటించక పోవడంతోనే ఇతర హీరోల నుండి, సూపర్ స్టార్ ను సపరేట్ చేసింది. చాలా ఇంటర్వ్యూలలో ఈ ప్రశ్న మహేష్ కు ఎదురయ్యింది కూడా!

ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన అనేక బ్లాక్ బస్టర్ సినిమాల గురించి మీడియా వర్గాలు ప్రశ్నించాయి. అయితే అవన్నీ ‘క్లాసిక్స్’గా అభివర్ణించిన మహేష్, వాటిని తాను రీమేక్ చేసి చెడగొట్టే ఉద్దేశం లేదని సుస్పష్టంగా తెలియజేసారు. ఇక ఒక భాషలో నుండి మరొక భాషలోకి తర్జమా అవుతున్న వర్తమాన ట్రెండ్ గురించి తన భావన పలు సందర్భాలలో వ్యక్తపరిచారు ప్రిన్స్.

ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరొక భాషలోకి అనువదిస్తే, రెండు భాషలను పోల్చి చూస్తారని, నా దృష్టిలో ఎప్పుడూ ఒరిజినల్ బాగుంటుందని, దానిని మించి తాను చేయలేనేమో అన్న భయం తనలో ఎక్కువగా ఉంటుందని, అందుకే ఎప్పుడూ రీమేక్స్ జోలికి వెళ్లనని వివిధ సందర్భాలలో చెప్పుకొచ్చారు. అది ‘రీమేక్స్’ మీద మహేష్ తీసుకున్న స్టాండ్.

అలాంటి మహేష్ వారసత్వంతో అడుగుపెట్టిన గల్లా అశోక్ మాత్రం, మహేష్ నటించిన “మురారి” సినిమాను రీమేక్ చేయాలని ఉందంటూ భారీ ప్రకటనే చేసారు. అయితే ఈ విషయంలో తన మామ మహేష్ ను ఫాలో అయిపోతూ రీమేక్స్ జోలికి వెళ్లకుండా ఉండడం అత్యుత్తమం అన్న సలహాలు అశోక్ కు వస్తున్నాయి.

అందులోనూ “మురారి” లాంటి క్లాసిక్ ను మళ్ళీ తెరకెక్కించాలనుకోవడం చేతులు కాల్చుకోవడమే అన్న ఉచిత సలహాలకు కొదవలేదు. కృష్ణవంశీ అద్భుత సృష్టిలలో “మురారి” కూడా ఒకటి. వంశీ రాసిన కధకు మహేష్ తన అభినయంతో ప్రాణం పోసాడు. నటుడిగా మహేష్ స్థాయి ఏమిటన్నది వెండితెరకు పరిచయం చేసిన సినిమాగా “మురారి”కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.

అలాంటి సినిమాను రీమేక్ చేయడం అనేది పక్కన పెడితే, అసలు అలాంటి ఆలోచనలు కూడా చేయకుండా ఉండడం బెటర్. బహుశా మహేష్ నటించిన సినిమాలలో తనకు అత్యంత ఇష్టమైన మూవీగా “మురారి”ని పేర్కొనే క్రమంలో, రీమేక్ చేయాలని ఉందని చెప్పారో ఏమో గానీ, “హీరో” ద్వారా మంచి పేరు తెచ్చుకున్న గల్లా అశోక్ విభిన్నమైన పాత్రలు చేయాలని ఆశిద్దాం.