Itlu Maredumilli Prajaneekamథియేటర్ సినిమాకు అర్థం క్రమంగా కొత్త రూపం తీసుకుంటోంది. కరోనా వెళ్ళిపోయి ఓటిటి ట్రెండ్ ఊపందుకున్నాక ప్రేక్షకుల అభిరుచుల్లో అనూహ్య మార్పులొచ్చాయి. థియేటర్ కు రావాలంటే చాలా ప్రత్యేకమైన కారణాన్ని డిమాండ్ చేస్తున్నారు. సమాజంలో సమస్యలను వాటికి పరిష్కారాలను చూపిస్తామంటే ఒప్పుకోవడం లేదు. అంత ఓపిక ఇప్పటి ఆడియన్స్ లో లేదు. అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకానికి వసూళ్లు చాలా నెమ్మదిగా ఉన్నాయి. మంచి మార్కెట్ అనుభవించిన ఇరవై ఏళ్ళ కెరీర్ ఉన్న హీరో పరిస్థితి ఇది. అసలు మొహమే తెలియని తమిళ దర్శకుడి లవ్ టుడేకి నిన్న సాయంత్రం నుంచే హౌస్ ఫుల్స్ మొదలైపోయాయి.

మారేడుమిల్లి ఖచ్చితంగా బాలేని సినిమా కాదు. మంచి కాన్సెప్టే. కానీ దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు జనానికి ఎక్కడం లేదు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఓ నియోజకవర్గం తీవ్ర సమస్యల్లో ఉంటే దానిపై పోరాడేందుకు మహేష్ బాబు నడుం బిగిస్తే విజిల్స్ కొడతాం. లేదూ జూనియర్ ఎన్టీఆర్ ఆ సమస్యలకు కారణమైన వాళ్ళ తుప్పు లేపితే వసూళ్లు కురిపిస్తాం. అంతే తప్ప అల్లరోడు సీరియస్ మొహం పెట్టుకుని వాళ్ళ కోసం పోరాడితే ఉసూరుమంటాం. నరేష్ అద్భుతమైన పెర్ఫార్మర్. అందులో సందేహం లేదు. కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. ఎప్పుడో వచ్చిన గమ్యంలో క్రిష్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఇతని సత్తా ప్రపంచానికి పరిచయం చేశాడు.

కామెడీ జానర్ అవుట్ డేటెడ్ కావడంతో అల్లరి నరేష్ పూర్తిగా మెసేజ్ సినిమాల వైపు మొగ్గు చూపడం కరెక్ట్ కాదు. ఆ మాటకొస్తే అభిమానులూ వాటిని డిమాండ్ చేయలేదు. నాంది సక్సెస్ కు కారణం అందులో ఉన్న కోర్ట్ రూమ్ డ్రామా, తనను ఇరికించిన వాళ్ళను కథానాయకుడు పట్టుకునే తీరు మాస్ కి సైతం కనెక్ట్ అయ్యేలా చూపించడం. అంతే తప్ప ఓ అమాయకుడి రోదనను ఆస్వాదించేందుకు పబ్లిక్ టికెట్లు కొనలేదు. నరేష్ ఈ బేసిక్ సూత్రం మర్చిపోతున్నాడు. దర్శకులు ఎగ్జైటింగ్ గా సోషల్ ఇష్యూ మీద సబ్జెక్టు చెప్పగానే థ్రిల్ అయిపోయి ఒప్పేసుకుంటున్నాడు. కలెక్షన్లు రానప్పుడు నటనకు ఎన్ని ప్రశంసలు వస్తేనేం

కొంచెం వెనక్కు వెళ్తే రుద్రవీణలో సామజిక అంశాలను స్పృశించిన చిరంజీవికి బాక్సాఫీస్ వద్ద తిరస్కారం ఎదురయ్యింది. అదే పని ఠాగూర్ లోనూ చూపించి హీరోయిన్ తో డాన్సులు, విలన్లతో ఫైట్లు చేస్తే రికార్డుల వర్షం కురిసింది. శంకర్ జెంటిల్ మెన్ లో గొప్ప కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ శుభశ్రీ క్యారెక్టర్ తో చేసిన సి గ్రేడ్ కామెడీని మర్చిపోకూడదు. మారేడుమిల్లిలో ఇవి ఉండాలని కాదు. కమర్షియల్ కోటింగ్ లేకుండా ఏ మెసేజ్ అయినా సరే రెండు మూడో తరగతి మాసోడికి చేరదు. ఇది తెలుసుకుని థియేటర్ కు రాడు. బాల్కనీ వాడు ఓటిటిలో చూద్దామని ఎదురు చూస్తాడు.ఫలితంగా బిసి సెంటర్లలో సీట్లు ఖాళీగా ఉంటాయి. అందుకే సందేశాలు సమస్యలతో పనవ్వదు బాసూ