it-raids-on-bahubali-producers-2ఇండియా వ్యాప్తంగా దాదాపు 600 కోట్ల రూపాయల వసూలు చేసిన “బాహుబలి” సినిమా నిర్మాతలపై ఐటీ దాడులు జరగడం టాలీవుడ్ లో కలకలం రేపింది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో కుదేలవుతున్న సినీ పరిశ్రమకు ఈ ఐటీ దాడులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందని భావించిన “బాహుబలి” ఫస్ట్ పార్ట్ ను యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ లు నిర్మించారు. అలాగే రెండవ పార్ట్ కోసం దాదాపుగా 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాల్లో సమాచారం హల్చల్ చేస్తోంది. ఈ పరిణామాలతో ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ దాడులు కూడా ఇద్దరి ఆఫీసులపై ఏకకాలంలో సోదాలు నిర్వహించడంతో పక్కా ప్రణాళికతో ఐటీ శాఖ అడుగులు వేస్తున్నట్లుగా కనపడుతోంది. అయితే ఈ సోదాలలో ఏం లభించినా, లేకున్నా… తర్వాత ఎవరిపై దాడులు చేస్తారో అన్న ఆందోళన టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది. కేవలం నిర్మాతల వరకే పరిమితం అవుతుందా? లేక టాలీవుడ్ లో కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న అగ్ర హీరోలకు కూడా ఈ సెగ తగులుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పెద్ద సినిమాలకు భారీ దెబ్బ పడినట్లేనని విశ్లేషకులు వాపోతున్నారు.

ఈ రోజు విడుదలైన సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కూడా లేక ధియేటర్లు వెలవెలబోతుంటే… మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఈ ఐటీ దాడులు సినీ జనాలను మరింత నీరసించిపోయేలా చేస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ తో అగ్ర నిర్మాతలంతా బిక్కుబిక్కుమంటున్నారు. మరి ఈ సోదాల ఫలితం ఏంటన్నది తెలిసిన తర్వాత తదుపరి పర్యవసానాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా బిగ్ షాట్స్ ను టార్గెట్ చేస్తూ గురువారం నాడు మొదలైన ఈ ఐటీ దాడులు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.