Vishwak Senఏదైనా సరే సినిమా మాట్లాడాలి తప్పించి హీరోలు వీలైనంత తక్కువ మాటలతోనే సరిపుచ్చాలి. అప్పుడే ఆడియన్స్ లో ఇమేజ్ తో పాటు గౌరవమూ పెరుగుతుంది. ఒక స్థాయికి అంటే టైర్ 1 రేంజ్ కు చేరుకున్నాక ఎన్ని అతిశయోక్తులు పోయినా ఇబ్బంది ఉండదు. జనాలు అంతగా గుర్తు పెట్టుకోరు. ఉదాహరణకు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ గురించి ఎన్ని ఎలివేషన్లు ఇచ్చుకున్నా చెల్లిపోతాయి. వాటిలో అబద్దాలు నిజాలు రెండూ ఉండొచ్చు. ఏ సమస్యా లేదు. కానీ అప్ కమింగ్ స్టేజి లో ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

ఇటీవలే దాస్ కా ధమ్కీ ప్రమోషన్లలో విశ్వక్ సేన్ సెకండ్ హాఫ్ మొత్తం కుర్చీ అంచుల్లో కూర్చుని చూస్తారని ఇలాంటి కథను తాను తప్ప ఎవరూ తీయలేరని చాలా స్ట్రాంగ్ గా చెప్పుకున్నాడు. కట్ చేస్తే పండగ టైంలో వచ్చిన వసూళ్లు తప్ప తర్వాత బాగా నెమ్మదించిపోయింది. యావరేజ్ కు ఒక మెట్టు పైన నిలవడమే గొప్పనేలా ఉంది పరిస్థితి. నిజానికి సినిమా గురించి ముందే గొప్పగా వర్ణించడంలో తప్పు లేదు. కానీ సోషల్ మీడియా కాలంలో అది కాస్త హద్దుల్లో ఉంటేనే బెటర్. పాగల్ టైంలో ట్రోలింగ్ కు గురి కావడం విశ్వక్ అప్పుడే మర్చిపోయాడు.

ఇక్కడ మరో కోణం కూడా ఉంది. మాకెవరూ లేరు మేమే స్వంతంగా పైకి వచ్చామని చెప్పుకుని సానుభూతి ద్వారా ప్రమోషన్ చేయడం అన్ని వేళలా పని చేయదు. పెద్ద పెద్ద బ్యానర్లు ముందుకొస్తున్నా కిరణ్ అబ్బవరం ఇలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వడం పరిపాటిగా మారింది. రవితేజ, నాని లాంటి వాళ్ళు హార్డ్ వర్క్ తో పైకొచ్చినవాళ్లే. సిద్దు జొన్నలగడ్డకు పదేళ్ల తర్వాత డీజే టిల్లుతో బ్రేక్ దొరికింది. అప్పటిదాకా చిన్నా చితకా వేషాలు ఎన్నో వేశాడు. ఓపిక ఉంటేనే ఇక్కడ నెగ్గుకురాగలమనే సూత్రానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

మార్కెట్ పెంచుకోవడం అందరికీ అవసరమే. దానికి సరైన హిట్లు పడాలి. విజయ్ దేవరకొండ ఎన్ని డిజాస్టర్లు వచ్చినా క్రేజ్ ఎందుకు కొనసాగుతోందంటే అర్జున్ రెడ్డి లాంటి ఒక పవర్ ఫుల్ అస్త్రం ఒకటి సరిగ్గా తగిలింది. తనూ లైగర్ టైంలో అవసరం లేని మాటలు గొప్పలు చాలానే పోయాడు. అది మరీ అడ్రెస్ లేనంత ఫ్లాప్ కావడంతో తత్వం బోధపడి సైలెంట్ అయ్యాడు. ఎదగాలంటే ఒదిగి ఉండక తప్పదు. ఎవరిదీ వాళ్ళ దృష్టిలో తప్పు కాకపోవచ్చు. కానీ సెలబ్రిటీల ప్రవర్తనకు బయట సమాజంలో లక్షల్లో జడ్జీలు ఉంటారు. మనకు సంబంధం లేదని తప్పించుకోవడానికి లేదు. స్టార్ డం పోషకులు వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా లోబడే ఉండాలి. లేదంటే పూలేసిన చేతులే రాళ్ళూ వేస్తాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో.