మనం అమితంగా ప్రేమించేవారిని లేదా అమితంగా ద్వేషించేవారినే ఎక్కువగా తలచుకొంటుంటాము. ఇది మానవ నైజం. ప్రేమించేవారిని ఎందుకు తలుచుకొంటామో చెప్పగలం. కానీ ద్వేషించేవారిని తలుచుకోవడానికి ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉండవచ్చు. ఉదాహరణగా తెలంగాణ సిఎం కేసీఆర్ నిత్యం ప్రధాని నరేంద్రమోడీని తిడుతూ ఆయన నామస్మరణ చేస్తుంటే, ఏపీలో వైసీపీ నేతలు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్‌ల నామస్మరణ చేస్తుంటారు. కారణాలు అందరికీ తెలుసు. వైసీపీ చంద్రబాబునాయుడుని చూసి ఆందోళన చెందుతోందటే అర్ధం చేసుకోవచ్చు కానీ పెద్దగా రాజకీయ అనుభవం, రాజకీయ పరిణతి, అంగబలం, అర్ధబలం లేని పవన్ కళ్యాణ్‌ను చూసి ఎందుకు ఆందోళన చెందుతోంది? వైసీపీ నేతలు నిత్యం ఆయన నామస్మరణలో ఎందుకు తరించిపోతున్నారు? అనే సందేహం కలుగక మానదు.
గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సమావేశాలు నిర్వహించినప్పుడు లక్షలాదిగా అభిమానులు తరలివచ్చి ఆయన సభలను విజయవంతం చేశారు. కానీ పవన్ కళ్యాణ్‌తో సహా జనసేన అభ్యర్ధులకు ఓట్లు వేయలేదు. కారణాలు ఏవైతేనేమి వారిలో కాపు సామాజిక వర్గానికి చెందినవారు కొందరు టిడిపికి, మరికొందరు వైసీపీకి ఓట్లు వేశారు. ఇదే విషయం ఆయన తరువాత స్వయంగా చెప్పుకొన్నారు కూడా. అది వేరే విషయం.
“ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనీయను,” అని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడే వైసీపీ అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఈ మూడేళ్ళలో జగనన్న పాలన రుచి చూడటంతో కాపు సామాజిక వర్గం మళ్ళీ టిడిపి, జనసేనలవైపు తిరుగు ప్రయాణం అవుతోందని వైసీపీ పసిగట్టింది.
కనుక వారు తిరిగి జనసేనవైపు వెళితే తక్కువ నష్టం జరుగుతుంది కానీ పొరపాటున టిడిపి వైపు వెళ్ళినా ఎన్నికలలో వైసీపీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వారు అటువైపు వెళ్ళకుండా అడ్డుకొనేందుకే పవన్ కళ్యాణ్‌ను దత్తపుత్రుడు, చంద్రబాబునాయుడుకి బంటు, బానిస అంటూ టార్గెట్ చేసినట్లు కనబడుతోంది. తద్వారా వారిలో పవన్ కళ్యాణ్ సానుభూతి పెరిగి జనసేనవైపు మొగ్గుచూపుతారని వైసీపీ భావిస్తున్నట్లుంది.
మరో విషయం ఏమిటంటే, టిడిపితో పొత్తు పెట్టుకొన్నట్లయితే వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమని ప్రజలు కూడా భావిస్తారని, కనుక టిడిపితో పొత్తులు పెట్టుకోవద్దని కాపు సామాజిక వర్గం చేతనే పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి చేయించి, టిడిపి, జనసేనలను దూరంగా ఉంచాలనే వైసీపీ వ్యూహంలో భాగంగానే ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ నామస్మరణ చేస్తునట్లు కనిపిస్తున్నారు.
అంతేకాదు… పవన్ కళ్యాణ్‌పై కుటుంబపరంగా కూడా ఒత్తిడి పెంచేందుకు వైసీపీ నేతలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల మద్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. చిరంజీవిని దేవుడని పొగుడుతుండటం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, బంటు, బానిస, వావివరుసలు లేని రాజకీయ నాయకుడని విమర్శిస్తుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనబడుతోంది.
అయితే టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొన్నా పెట్టుకోకపోయినా వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఎదురీత తప్పకపోవచ్చు.
That Section Of Only NTR Fans Are YCP Coverts?
Bunny Is Now Nandamuri Allu Arjun!