IS YSR Congress using Mudragada Padmanabham for kapu votesఎవరు అనునాన్నా… కాదన్నా… వచ్చే శాసనసభ ఎన్నికలు గత ఎన్నికలలాగ ఏకపక్షంగా ఉండవని ఖచ్చితంగా చెప్పవచ్చు.

సంక్షేమ పధకాల కారణంగా వచ్చే ఎన్నికలలో 175 సీట్లు తమకే అని సిఎం జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ, గడప గడపకి కార్యక్రమం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే టిడిపి మళ్ళీ బలం పుంజుకొంటుండగా, జనసేన కూడా బలపడుతోంది. ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొనే సూచనలు కనిపిస్తున్నాయి.

బిజెపి ఒంటరిగా పోటీ చేయలేదు కనుక అది కూడా టిడిపితో పొత్తుకి సిద్దపడవచ్చు. అదే కనుక జరిగితే వైసీపీకి గట్టి పోటీ తప్పదు. ఒకవేళ బిజెపి కలవకపోయినా అమరావతి సెంటిమెంట్ రాజేస్తోంది కనుక దాని వలన వైసీపీకి కొంత నష్టం తప్పదు. ఇక అమరావతిలో రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. వారిని వైసీపీ ప్రభుత్వం చేజెతులా దూరం చేసుకొంది కనుక వారు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న టిడిపి లేదా దాని కూటమివైపు మొగ్గుచూపడం తధ్యం.

ఇప్పటికే కొన్ని జిల్లాలలో జనసేన బలపడినట్లు సర్వేలు చెపుతున్నాయి. కనుక పవన్‌ కళ్యాణ్‌ ఈ దసరా నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్దమవుతున్నారు. ఆయన రాజకీయంగా నిలకడగా ఉంటూ, సరైన నిర్ణయం తీసుకొంటే ఈసారి కాపు కులస్థులు ఆయనకి మద్దతు ఈయవచ్చు.

ఈ విషయం వైసీపీ ముందే గ్రహించింది. అందుకే పవన్‌ కళ్యాణ్‌ని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. ఒకవేళ ఈసారి కాపు కులస్థులు జనసేనవైపు మొగ్గు చూపితే వైసీపీ తీవ్రంగా నష్టపోతుంది. కనుక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని దువ్వుతున్నట్లు సమాచారం. వైసీపీలో చేరాలని ఆహ్వానించగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వైసీపీ తనను పిలిచి పెద్దపీట ఎందుకు వేస్తోందో అర్దం చేసుకోలేని రాజకీయ అజ్ఞాని కాదు ఆయన.

కానీ ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు వైసీపీలో చేరితే ప్రత్తిపాడు నుంచి టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తాజా సమాచారం. తద్వారా ముద్రగడ మద్దతు వైసీపీకి లభిస్తుంది. అప్పుడు రాష్ట్రంలో కాపులందరూ జనసేనకు బదులు వైసీపీవైపు మొగ్గు చూపుతారనేది వైసీపీ తాజా వ్యూహం.

కానీ ముద్రగడపై అభిమానంతో వైసీపీకి ఓటేస్తే కొరివితో తల గోక్కొన్నట్లే అవుతుందని రాజకీయంగా చాలా చైతన్యవంతులైన కాపులకి తెలుసు. కనుక ముద్రగడను వైసీపీ రధంలో ముందుంచుకొని ఎన్నికల కురుక్షేత్రానికి వస్తే కాపులందరూ ఆయనను చూసి మళ్ళీ జగన్‌కి ఓటేస్తారా?అంటే వేసినా వేయకపోయినా వారి ఓట్లలో చీలిక తేవచ్చునని వైసీపీ భావిస్తోంది. ఆవిదంగానైనా జనసేన, టిడిపిలను అడ్డుకోవాలని వైసీపీ భావిస్తోంది. మరి రాష్ట్రం పరిస్థితులను కళ్ళారా చూస్తున్న కాపు ఓటర్లు వచ్చే ఎన్నికలలో ఏ గట్టున ఉండాలో వారే తేల్చుకోవాలి.