is ys vijayamma resigned from ysr congress partyసంచలన కధనాలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పెట్టింది పేరు. జగన్ కుటుంబంలో లుకలుకలు ఉన్నాయని, సోదరి షర్మిలకు – జగన్ కు పడడం లేదని, ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం త్వరలోనే బద్దలవుతుందని తొలుత వెల్లడించిన ఘనత ఏబీఎన్ దే. కాలక్రమేణా అది ఏమైందో అందరికీ తెలిసిన విషయమే.

మళ్ళీ అలాంటి సంచలన కధనమే ‘వీకెండ్ ఆర్కే’ కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు ఏబీఎన్ ప్రసారం చేసింది. అయితే ఈ సారి తల్లి విజయమ్మ వంతు వచ్చింది. త్వరలోనే పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి జగన్ తల్లి విజయమ్మ రాజీనామా చేయబోతున్నారని ప్రసారం చేసిన కధనం అధికార పార్టీ వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది.

ఈ విషయాన్ని ఇటీవల విజయమ్మ స్వయంగా జగన్ కు చెప్పగా, ప్లీనరీ సమావేశాల వరకు కొనసాగమని విన్నవించినట్లుగా ఈ కధనంలో పేర్కొన్నారు. ఇప్పటికే సోదరి షర్మిలను దూరం చేసుకున్న జగన్, ఇపుడు తల్లి కూడా దూరమైతే ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయో అన్న ఆందోళనలు పార్టీ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి.

సొంత కుటుంబీకులే జగన్ వ్యవహారశైలితో ఇమడలేకపోతున్నారనే నానుడి ప్రజల్లోకి బలంగా వెళితే, అది పార్టీకి తీవ్రనష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది గనుక, ఏబీఎన్ ప్రసారం చేసిన ఈ కధనం నిజం కాకూడదని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సోదరి షర్మిల ఉదంతం మాదిరే, రానున్న కాలంలో ఇది గనుక నిజమైతే, ఏబీఎన్ మరిన్ని సంచలనాలకు తెరతీసే అవకాశం ఉంటుంది.