JP_Nadda_BJPబిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా నేడు విజయవాడ వచ్చారు. అక్కడ జరిగిన బిజెపి శక్తి కేంద్రాల ప్రముఖుల సమ్మేళనంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46 వేల పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. మనం ఆ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలి. అందుకోసం ఆ స్థాయిలో ప్రజలతో మమేకం కావలసి ఉంటుంది.

రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పధకాలు కేంద్రం నిధులతోనే నడుస్తున్నాయనే సంగతి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు జగన్ ప్రభుత్వం తనదిగా చెప్పుకొంటున్న ఆరోగ్యశ్రీ పధకం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పధకంలో భాగం మాత్రమే. ఆరోగ్యశ్రీ పధకం కేవలం రాష్ట్రానికే పరిమితం కానీ ఏపీలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ పధకంతో దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రూ.5 లక్షల విలువగల వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు.

అలాగే వైఎస్సార్ రైతు భరోసా పధకంలో భాగంగా రైతులకు చెల్లిస్తున్న రూ.13,500లలో కేంద్రప్రభుత్వం రూ.6,000 చొప్పున ఇస్తోంది. కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తునట్లు వైసీపీ ప్రచారం చేసుకొంటోంది. కనుక సంక్షేమ పధకాలకు కేంద్రప్రభుత్వం కూడా భారీగా నిధులు ఇస్తోందనే విషయం ప్రజలకు తెలియజేసి వారికి బిజెపిని చేరువచేయాల్సి ఉంది,” అని అన్నారు.

టిడిపి ప్రవేశపెట్టిన పధకాలనే కాకుండా బిజెపి పధకాలను కూడా సొంత పధకాలుగా వైసీపీ ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని ఆశపడటం సహజమే. అయితే ఆ పధకాల కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొంటున్నందున, జేపీ నడ్డా వాదనలను ఖండించే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా?

ఒకవేళ జేపీ నడ్డా వంటి జాతీయ బిజెపి నేతలు రాష్ట్రంలో పర్యటించి తమ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శిస్తే, వైసీపీ నేతలు వారికి గట్టిగా సమాధానం చెప్పగల ధైర్యం ఉందా?అమరావతిలోనే రాజధాని ఉంటుందని నిర్ద్వందంగా చెపుతున్న బిజెపి నేతల వాదనలను కాదనే ధైర్యం వైసీపీలో ఎవరికైనా ఉందా?