జగన్ పాలన పై కేంద్రం దృష్టిసారించే సమయం వచ్చిందా?ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ రాష్ట్రంలో మాత మార్పిడులు ఎక్కువ అయ్యాయి అని ఒక అభిప్రాయం అయితే ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా క్రైస్తవుడు కావడం… వారి కుటుంబంలో మత ప్రబోధకులు ఉండటంతో ఈ అభిప్రాయం ఎక్కువైంది.

అయితే ఉన్న ఫలంగా కేంద్రం ఈ విషయం మీద దృష్టి సారించిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. మూడు రోజుల క్రితం రాష్ట్రంలో అధికంగా మతమార్పిడులు జరుగుతున్నాయని నాగరాజు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై స్పందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ పదిహేను రోజులలో దాని మీద సమాధానం చెప్పాలని చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది.

సరిగ్గా అదే సమయంలో బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ది ఆర్గనైజర్‌’ లో రాష్ట్రంలో మతమార్పిడులే అజెండాగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలన సాగుతోందని విమర్శించింది. జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు పాశ్చాత్య క్రిస్టియన్‌ మిషనరీ అజెండాను అమలు చేస్తున్నారని పేర్కొంది. దీనివల్ల దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేసింది.

అధికారం కోసం జగన్‌ కుటుంబం ప్రమాదకరమైన హిందూ వ్యతిరేక అజెండాను అనుసరిస్తోందని ఆరోపించింది. జగన్‌ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ అనిల్‌ కుమార్‌ పేర్లను కూడా ఈ కథనంలో ప్రస్తావించింది. ఉన్నఫళంగా బీజేపీ పార్టీ పరంగా అలాగే… ప్రభుత్వంలోని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇదే అంశం ప్రస్తావించడం నిజంగా దీని వెనుక ఏదైనా ఉందా? మాత మార్పిడులు ఎక్కువ అయ్యాయి అనే విషయంగా కేంద్రం దృష్టిసారించే సమయం వచ్చిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.