రాను రాను సంక్రాంతి టాలీవుడ్ పాలిట బంగారు బాతులా మారుతోంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలతో రిస్క్ లేకుండా సేఫ్ గేమ్ ఆడే హీరోలు పోటీ పడి మరీ ఆ టైంకి రిలీజ్ ఉండేలా నిర్మాతల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ త్వరగా షూటింగ్ అయిపోతే ఆగిమరీ జనవరికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 2024కి అప్పుడే పుష్ప పార్ట్ 2, రామ్ చరణ్ 15 లను ఫిక్స్ చేస్తున్నారనే వార్త మీడియా వర్గాల్లో గట్టిగానే తిరుగుతోంది. ఇదే జరిగితే మరోసారి మైత్రి వర్సెస్ దిల్ రాజు క్లాష్ తప్పదు. ఇంకా సంవత్సరం టైం ఉన్నా ముందే కర్చీఫ్ వేసుకోవాల్సిన పరిస్థితి
నిజానికి ఏడాది మొత్తంలో అన్నేసి నెలలు ఉండగా కేవలం పొంగల్ ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవడం బిజినెస్ కోణంలో కొంత వరకు కరెక్టే కానీ పూర్తిగా కాదు. కొన్ని ఉదాహరణలు చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. మనం గొప్ప ఇండస్ట్రీ హిట్స్ గా చెప్పుకునే బాహుబలి 2, పోకిరి, ఎన్టీఆర్ అడవి రాముడు వచ్చింది ఏప్రిల్ లోనే. ఇది వేసవి సెలవుల కాలమే అయినా భారీ వసూళ్లతో రికార్డులను తిరగరాశాయి. అలీ యమలీల బ్లాక్ బస్టర్ అయ్యింది ఈ నెలలోనే. భైరవ ద్వీపం, హలో బ్రదర్ లాంటివి వంద రోజులు ఆడింది ఇలాంటి కాలాల్లోనే
సరే పాత ఉదాహరణలు ఎందుకనుకుంటే ఇప్పుడున్న స్టార్ల సంగతి చూసినా అర్థమైపోతుంది. రంగస్థలం వచ్చింది ఫక్తు పరీక్షల సమయం మార్చిలో. రీసౌండ్ వినిపించింది. టెంపర్ రిలీజయ్యింది బ్యాడ్ టైంగా చెప్పుకునే ఫిబ్రవరిలో. పూరికి తారక్ కి మంచి కంబ్యాక్ అయ్యింది. మహర్షి వచ్చింది హాలిడేస్ అయ్యాక మొదలయ్యే మేలో. వంద కోట్లు దాటేసింది. శ్రీమంతుడుని ఆగస్ట్ లో తెస్తే మహేష్ ఖాతాలో కొత్త బెంచ్ మార్కులు వచ్చాయి. ఛత్రపతి సెప్టెంబర్, విక్రమార్కుడు జూన్, ఆర్య మే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో
ఏతావాతా తేలేదేంటంటే కంటెంట్ లో దమ్ము ఉండాలే కానీ దానికి సీజన్లతో సెంటిమెంట్లతో పని లేదు. ఎప్పుడైనా సరే దున్నేసుకోవచ్చు. కేవలం సంక్రాంతికి మాత్రమే కాసులొస్తాయి అప్పుడే నాలుగు డబ్బులు ఎక్కువ చేసుకుందామని తాపత్రయపడటం కరెక్ట్ కాదు. థియేట్రికల్ రన్ క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో పెట్టుబడి సేఫ్ కావాలంటే క్వాలిటీ మీద మరింత ఫోకస్ పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ప్రతిసారి అందరికీ అనుకూలమైన కోరుకున్న డేట్లే రావుగా. సత్తా ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చినా ఒకటే.