Is there anything worse than this, Modiఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ఆపిన పెట్రో మంటలు… ఫలితాలు వచ్చిన మరునాడే మొదలయ్యాయి. ఆ తరువాత మే నెలాఖరు వరకు ఆపు లేకుండా పెరుగుతూనే పోయాయి. మే నెలలో ఫలితాల కోసం ఆపిన మొదటి ఐదు రోజులు తీసేస్తే… మిగతా 26 రోజులలో 17 రోజుల పాటు ధరలు అంతో ఇంతో పెరుగుతూనే ఉన్నాయి.

దానితో దేశంలోని చాలా చోట్ల ఇప్పటికే పెట్రోల్ రేట్ లీటర్ కు వంద దాటింది.మిగతా చోట్ల వందకు చాలా దగ్గరగా ఉంది. కాంగ్రెస్ కాలం నుండీ నేటి వరకు పెట్రోల్ రేట్లు పెరగడం తప్పు కాదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వారు… ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో సహా ఎంతో గోల చేసేవారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ కు ఆ తెలివితేటలు కూడా లేకుండా పోయాయి. అది వేరే విషయం! అయితే రాజకీయాలు పక్కన పెడితే పెట్రోల్ రేట్లు పెరగడంలో తప్పేంటి? మన దగ్గర దొరకదు కాబట్టి అంతర్జాతీయ రేట్లను ఫాలో కావాల్సిందే. అయితే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం మాత్రం దారుణం.

దేశమంతా క్లిష్ట పరిస్థితిలో ఉంది… ఉద్యోగాలు పోతున్నాయి… వేతనాలు కట్ అవుతున్నాయి… ప్రజలకు అనుకోకుండా కోవిడ్ రూపంలో అప్పులు మిగులుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో పెట్రోల్, డీజిల్ రేట్ల పేరు చెప్పి నిత్యావసరాల సరుకుల ధరల నుండీ ఆసుపత్రికి మోసుకెళ్లే అంబులెన్సులు… కాడికి మోసుకెళ్లే వాహనాలు కూడా ప్రియం అయిపోయాయి. ఎన్నికల కోసం ఆగిన ధరల పెంపు… ప్రజల కోసం ఒక్కసారైనా ఆపడం తప్పు లేదు. అందుకు భిన్నంగా జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా మోడీ గారు అని అనిపించకమానదు.