Tollywood Herionesటాలీవుడ్ లో హీరోయిన్లకు కరువొచ్చింది. దేశ జనాభాలో అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువైపోతున్నట్టు ఇండస్ట్రీలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. యాభై వయసు దాటిన సీనియర్ హీరోతో మొదలుపెట్టి పాతికేళ్ళు దాటని కుర్ర హీరో దాకా అందరికి సరైన జోడిని వెతకాలంటే ఛార్టర్డ్ అకౌంటింగ్ ఫైనల్ ఎగ్జామ్ రాయడం కన్నా కష్టంగా ఫీలవుతున్నారు దర్శకులు. పోనీ ఎవరో ఒకరిని కాస్త చూడబుద్దేసే వాళ్ళను పెట్టుకుందామా అంటే ఆడియన్స్ ఒప్పుకోవడం లేదు. ఏ మాత్రం అటుఇటుగా ఉన్నా సరే ఆ ప్రభావం నేరుగా ఫలితం మీద పడుతోంది.

దెబ్బకు ఒకటి రెండు ఆప్షన్ల మీదే ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులు శ్రీలీల లాంటి అప్ కమింగ్ హీరోయిన్లకు వరంగా మారుతున్నాయి. ఇప్పటిదాకా తన రిలీజైన సినిమాలు రెండే. పెళ్లి సందD డిజాస్టర్ కాగా ధమాకా రొటీన్ టాక్ తోనూ వంద కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ అందుకుంది. దాని విజయంలో ఈ అమ్మాయి గ్లామర్ చలాకీతనం ఎంతగా పని చేసిందో గుర్తించిన ప్రొడ్యూసర్లు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ లాంటి కుర్రాళ్లతో నటిస్తూనే పవన్ కళ్యాణ్ తో జట్టు కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంత సులభమైన నిర్ణయాలు కాదు.

నిన్నా మొన్నటి దాకా అయితే పూజా హెగ్డే లేదా రష్మిక మందన్న మాత్రమే బడా హీరోలకు ఛాయస్ గా ఉండేవాళ్ళు. పూజాకేమో వరస ఫ్లాపులు పలకరించాయి. రష్మిక ఫోకస్ బాలీవుడ్ మీద ఎక్కువైపోయి సౌత్ అవకాశాలను లైట్ తీసుకుంది. దీంతో థర్డ్ బెస్ట్ ఆప్షన్ ఎవరనే ప్రశ్నకు సమాధానం కొన్ని నెలలు దొరకలేదు. మెహ్రీన్ లాంటి వాళ్ళ గ్రాఫ్ బాగా డౌన్ అయిపోయింది. ఇక్కడే కాదు తమిళంలోనూ ఇలాంటి సన్నివేశమే ఉంది. పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే విజయ్ లాంటి హైప్రొఫైల్ స్టార్ కి పదిహేనేళ్ల సీనియారిటీ ఉన్న త్రిషనే తీసుకోవాల్సి వచ్చింది.

దీనికి పరిష్కారమే లేదా అంటే ఉంది. కాకపోతే ఒక ప్లాన్ పద్దతి ప్రకారం టాలెంట్ హంట్ జరగాలి. అంత ఓపిక మేకర్స్ కు లేదు. కోట్లు కుమ్మరించైనా సరే ప్యాన్ ఇండియా ఫ్లేవర్ కోసం కియారా అద్వానీ, దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, అలియా భట్ లాంటి వాళ్ళను తీసుకురాగలం కానీ దక్షిణాదిలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో అందమైన భామలే లేరా అంటే వెతకాలి. అనుష్క, కృతి శెట్టి, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాంటివాళ్లు వచ్చింది కేరళ, కర్ణాటక నుంచే కదా. వెతికి పట్టుకునే ఒక మెకానిజంని అభివృద్ధి చేయాలి. అప్పుడే ఈ సమస్యకు కొంతైనా పరిష్కారం దక్కుతుంది. అందరికీ శ్రీలీలలే దొరకరుగా.ప్రత్యాన్మాయాలు ఉండాల్సిందే.