ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కార్ పై దండయాత్ర ప్రారంభించారు. 1వ తారీఖుకి జీతాలు ఇవ్వడం లేదని, ఆఖరికి తాము దాచిపెట్టుకున్న డబ్బులను ప్రభుత్వం ఇవ్వడం లేదని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మండిపడ్డారు. డిసెంబర్ 1వ తేదీన సీఎస్ కు మెమోరాండం ఇవ్వడం ద్వారా ప్రారంభం అయ్యే నిరసన కార్యక్రమాల గురించి జేఏసీ తెలియజేసారు.

నిజానికి ఇదే ఉద్యోగస్తులు జగన్ అధికారం చేపట్టిన తొలినాళ్ళల్లో ఆకాశానికెత్తేస్తూ ప్రెస్ మీట్ లు నిర్వహించారు. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, జగన్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే మూడు రాజధానుల అంశానికి మద్దతు కూడా ప్రకటించిన జేఏసీ, ఇప్పుడు మూడు రాజధానులు దేవుడెరుగు మాకు జీతాలు కూడా ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు

ఈ విషయంపై స్పందించిన ప్రతిపక్ష నేత నారా లోకేష్, ఈ కష్టం పగవాడికి కూడా రాకూడని అభలాషించారు. అలాగే ఉద్యోగులు దాచుకున్న 1600 కోట్లుగా ప్రభుత్వం ఇవ్వడం లేదని, పీఆర్సీపై పెదవి విప్పడం లేదని, పెండింగ్ లో ఉన్న 7డీఏలను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ, అధికారంలోకి వచ్చేందుకు జగన్ చెప్పిన సీపీఎస్ సిస్టంను వెంటనే రద్దు చేయాలని కోరారు.

ఉద్యోగులు చేస్తున్న వినతులపై ఏపీ ఆర్ధిక శాఖామంత్రి బుగ్గన కూడా స్పందిస్తూ… ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి మెరుగుగా లేనందున, కాస్త కుదుటపడగానే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అప్పటివరకు ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అయితే బుగ్గన చేసిన ప్రకటన ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అన్న దానిపై చర్చ జరుగుతోంది.

ఓ వైపు రాజకీయ ఉద్దండ పండితులైన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు, ‘ఈ రాష్ట్రాన్ని కుబేరుడు వచ్చినా రక్షించలేడు’ అని చెప్తుండగా, మరి బుగ్గన గారు చేసిన ప్రకటన ఎప్పటికి కార్యరూపం సిద్ధించేను? జీతాలతో పాటు దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం వినియోగించుకోవడం ఉద్యోగస్తులకు ఏ మాత్రం మింగుడుపడని అంశంగా మారింది. ఏనాటికి కుదుటపడేను? ఎప్పటికి ఉద్యోగులు తేరుకునేను?