జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున భారీగా పబ్లిసిటీ కార్యక్రమాలు ‘సాక్షి’ మీడియాకు కేటాయింపులు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏ బిల్లులు పెండింగ్ లో ఉన్నా, ఈ ‘సాక్షి’కి జరిపే బిల్లులు మాత్రం పెండింగ్ లో ఉండవని రఘురామకృష్ణంరాజు వంటి ప్రముఖులు వివిధ సందర్భాలలో వెల్లడించిన విషయం తెలిసిందే.
అలాగే ఒకప్పుడు ‘సాక్షి’లో పనిచేసిన ఉద్యోగస్తులను రాష్ట్ర ప్రభుత్వ నియామకాలలో పెట్టి అందలం ఎక్కించిన వైనం కూడా విదితమే. ఇలా నెలకు కొన్ని వందల కోట్లను ‘సాక్షి’కి దోచి పెడుతోందని టీడీపీ నాయకులు చాలా సందర్భాలలో గొంతు చించుకున్నారు. అన్ని పత్రికలతో పాటు కాకుండా ‘సాక్షి’కి ప్రత్యేక పేమెంట్ లు ఉండడమే ఈ విమర్శలకు కారణంగా తెలుస్తోంది. ప్రజల సొమ్ము ఈ విధంగా ఎలా ఇస్తారంటూ ఆర్ఆర్ఆర్ కూడా రచ్చబండ కార్యక్రమంలో ప్రశ్నలు సంధించారు.
ఆర్ధికంగా సాక్షికి లభించే వెసులుబాటు ఇలా ఉంటుంటే, అసలు ఈ పత్రికలో ప్రచురించే సమాచారం గానీ, ఛానెల్ లో ప్రసారమయ్యే వార్తలు గానీ ఎక్కడా “సత్యం” ఉండదని, ‘సాక్షి’ అంత విషపూరితమైన ప్రచారం మిగిలిన ఏ మీడియా కూడా చేయదని టీడీపీ బలంగా చెప్తూ వస్తోంది. ఇటీవల కాలంలో టీడీపీ ప్రచారానికి ఊతమిచ్చేలా వివేకా హత్య కేసు మొదలు, గతంలో టీడీపీపై తప్పుడు కధనాలు ప్రసారం చేసిన సాక్షి విషయాలన్నీ అవాస్తవాలని ప్రజలు తెలుసుకుంటున్నారు.
ఈ ప్రభావం సాక్షి పత్రికపై కొంచెం గట్టిగానే పడినట్లుగా కనపడుతోంది. ఎందుకంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థ ‘సాక్షి’ కోసం ఓ ప్రత్యేక లేఖను విద్యార్థులకు అందించింది. ‘సాక్షి’ నుండి వచ్చిన ఈ మెయిల్ కు అనుగుణంగా, కేవలం 1000 రూపాయలకే సాక్షి దినపత్రికను అందజేయడం జరుగుతుందని ప్రిన్సిపల్ పంపిన లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. విద్యార్థులు సాక్షి దినపత్రికను కొనాల్సిన ఆవశ్యకత ఏమిటో కూడా ఈ లేఖలో వివరించి ఉంటే బహుశా ఈ విమర్శలకు తావుండేది కాదు.
సాక్షిని ఏపీలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి ఏపీలో జరుగుతోన్న తీరు ఇదంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోన్న విమర్శలు కోకొల్లలు. ప్రభుత్వం తరపున పబ్లిసిటీ రూపంలో భారీ స్థాయిలో నిధులు సాక్షికి వెళుతోన్నా, ఇంకా విద్యార్థుల నుండి ఈ దోపిడీ ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ‘రాజు మనోడే అయితే రాజ్యంలో ఏం చేసినా చెల్లుబాటు అగును’ అన్న చందంగా సాగుతోన్న ‘సాక్షి’ వ్యవహారం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుందా? అన్న రీతిలో ఈ శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థ ప్రిన్సిపల్ ఇచ్చిన లేఖ నిలుస్తోంది.
How to make Sakshi the number one newspaper in Andhra – by misusing government power. pic.twitter.com/dPZSlcaVfb
— Ramesh Kandula (@iamkandula) March 15, 2022