KCR Etela Rajenderతెలంగాణ సిఎం కేసీఆర్‌ తన రాజకీయ వ్యూహాలతో జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలని ముప్పతిప్పలు పెడుతూనే ఉన్నారు. ఆయనతోపాటు తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొని, ఆయన ప్రభుత్వంలో వరుసగా రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఈటల రాజేందర్‌కి ఉంది. అయితే కేసీఆర్‌ నిర్ణయాలని, విధానాలని ఆయన ప్రశ్నిస్తుండటంతో అసైన్డ్ భూములని కబ్జా చేశారంటూ మంత్రి పదవి తొలగించి అవమానించారు.

అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇరికించబోయే ఈటల రాజేందర్‌ బిజెపిలో చేరి కాషాయ రక్షణ కవచం తోడుక్కొని తప్పించుకొన్నారు. ఆ తర్వాత హుజురాబాద్‌ ఉపఎన్నికలలో ఈటల రాజేందర్‌ని రాజకీయంగా భూస్థాపితం చేయాలని కేసీఆర్‌ విఫలయత్నం చేశారు కానీ సాధ్యం కాకపోవాడంతో కేసీఆరే అప్రదిష్టపాలయ్యారు. కనుక కేసీఆర్‌ ఆయనపై ఎంత ప్రతీకరేచ్చతో రగిలిపోతున్నారో ఊహించుకోవచ్చు.

కనుక ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కు రావాలన్నట్లు, కేసీఆర్‌ నిన్న ఆదివారం శాసనసభ సమావేశంలో పదేపదే ఈటల రాజేందర్‌ పేరు ప్రస్తావిస్తూ, ఆయన చేసిన సూచనలని తమ ప్రభుత్వం పాటిస్తోందని, శాసనసభలో ఆయన లేవనెత్తిన వివిద ప్రజాసమస్యలని త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.

ఒకానొక సమయంలో శాసనసభలో ఈటల రాజేందర్‌ మొహం కూడా చూసేందుకు ఇష్టపడని కేసీఆర్‌, నిన్న శాసనసభలో పదేపదే ఈటల రాజేందర్‌ పేరును ప్రస్తావిస్తూ, సానుకూలంగా మాట్లాడటంతో కేసీఆర్‌ ఆయనని మళ్ళీ బిఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారంటూ ఊహాగానాలు మొదలైపోయాయి.

అయితే కేసీఆర్‌తో అనేక దశాబ్ధాలపాటు కలిసి పనిచేసిన ఈటల రాజేందర్‌కి కేసీఆర్‌ వ్యూహం అర్దం కాదనుకోలేము. అందుకే ఆయన వెంటనే స్పందిస్తూ, “శాసనసభలో కేసీఆర్‌ పదేపదే నాపేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారో ఊహించగలను. నన్ను అంత దారుణంగా అవమానించి బయటకి పంపేసారు. మళ్ళీ నేను బిఆర్ఎస్‌లో చేరే ప్రసక్తే లేదు. నేను ఏ పార్టీలో ఉంటానో దానికే విధేయంగా ఉంటాను. కేసీఆర్‌ ప్రభుత్వాని గద్దె దించి తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తేవడమే నా లక్ష్యం,” అని అన్నారు.

శాసనసభలో ఈటల రాజేందర్‌ పేరుపేరుని కేసీఆర్‌ పదేపదే ప్రస్తావించడం ద్వారా ఆయన మళ్ళీ బిఆర్ఎస్‌ గూటికి చేరుకొంటారేమో లేదా అటువంటి ఆలోచనలు చేస్తున్నారేమో?అని తెలంగాణ బిజెపిలో అనుమానాలు సృష్టించాలనుకొంటున్నట్లున్నారు. తెలంగాణ బిజెపిలో బండి సంజయ్‌ కంటే ఈటల రాజేందరే సమర్దుడని ఈవిదంగా తెలియజేస్తూ వారిరువురి మద్య విబేధాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారేమో?అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గతంలో ప్రధాని నరేంద్రమోడీ సన్నిహితంగా మెలుగుతూ రాష్ట్రంలో బిజెపి విశ్వసనీయతని కేసీఆర్‌ దెబ్బ తీశారు. ఇప్పుడూ కేసీఆర్‌ అదే ట్రిక్ ప్లే చేస్తున్నట్లున్నారు. కానీ మేనల్లుడి గోత్రం మేనమామకి తెలియదా అన్నట్లు కేసీఆర్‌ వ్యూహాలు ఈటల రాజేందర్‌కి తెలియకుండా ఉంటాయా?