is Jupally Krishna Rao trying to leave trs partyతెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో, వాటిని అందిపుచ్చుకోవడంలో ప్రతిపక్ష పార్టీలు దూకుడు మీద ఉన్నాయి. మొన్న ఈటెల బీజేపీ గూటికి చేరగా, ఇప్పుడు జూపల్లి ఓ జాతీయ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ప్రచారాలని ఖండించిన జూపల్లి కొంతకాలం స్తబ్దుగానే ఉన్నారు.

తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో జూపల్లి కృష్ణారావు మళ్ళీ తన స్వరం సవరించుకున్నట్లుగా పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గ కార్యకర్తలతో జూపల్లి మాట్లాడుతూ రానున్న తొమ్మిది నెలల్లో ఏం జరుగుతుందో అందరూ వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని., తానూ ఏ నిర్ణయం తీసుకున్నా, అది ప్రజల మేలు కోసమే అనే ప్రసంగాలతో కార్యకర్తలను ఆలోచనలో పడేసాయి.

ఈ రాజకీయ నాయకులు పార్టీలు మారే సమయంలో ఇచ్చే సమాధానం… “నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం.” పార్టీ మారాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ నినాదాన్ని అందుకుంటారో లేక ఈ నినాదంతో పార్టీ మారతారో గానీ, పార్టీ కండువాలు మార్చినప్పుడు మాత్రమే ఈ రాజకీయ నాయకులకు “అభివృద్ధి – సంక్షేమం” అనే రెండు పదాలు జ్ఞప్తికి రావడం శోచనీయం.

టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ముఖ్య నేతలుగా చెప్పుకుంటున్నవారిలో చాలా మంది టీడీపీ, కాంగ్రెస్ ల నుండి వలస వచ్చిన వారే కావడం గమనార్హం. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యమకారులపై కేసులు పెట్టి అధికారం చలాయించిన నేతలే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారనేది సొంత పార్టీ నేతల ప్రధాన ఆరోపణ.

విభజన పోరాటాల నుండి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న ముఖ్య నేతలకు సరైన గౌరవ మర్యాదలు పార్టీలో దక్కకపోవడం వలనే ఒక్కొక్కరు పక్కచూపులు చూస్తున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. మరి జూపల్లి కూడా ఈటెల మాదిరే ప్రభుత్వానికి ఎదురెళ్లి నెగ్గుతారో లేక ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తోన్న తప్పుడు ప్రచారాలని మరోసారి కొట్టి పారేస్తారో చూడాలి.

కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లారంటూ ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపధ్యంలో… ‘నిప్పు లేనిదే పొగ రాదన్న’ చందంగా ముఖ్య నేతల పార్టీ మార్పుల వార్తలు దేనికి సంకేతం? సహజంగా ఎన్నికల ముందు పార్టీలు మారుతున్నారంటే సొంత పార్టీ మరోసారి అధికారంలోకి రాదనే నమ్మకమే ఇలాంటి వాటికి ఊతమిస్తుంది. మరి టీఆర్ఎస్ నిజంగా అలాంటి పరిస్థితులలో ఉందా?