Is Janasena Party means just fans and Pawan Kalyanటిడిపి, వైసీపీలకు ఉన్న ఇబ్బంది జనసేనకు లేదు. అదేమిటంటే, ఎన్నికలలో టికెట్ల కోసం పోటీ ఉండదు. అందుకు ప్రధాన కారణం జనసేనలో ద్వితీయస్థాయి నాయకులను తయారుచేసుకోకపోవడమే అని చెప్పవచ్చు. జనసేన పార్టీ అంటే పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్, పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల ప్రస్తావనే వినిపిస్తుంది తప్ప టిడిపి, వైసీపీలలోగా రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకుల పేర్లు వినిపించవు.

జనసేనలో ద్వితీయశ్రేణి నాయకులు ఉన్నప్పటికీ వారికి గుర్తింపు కలిగించేలా పవన్‌ కళ్యాణ్‌ ఎన్నడూ ప్రయత్నించిన దాఖలాలు కనబడవు. కనుక జనసేన తరపున అభ్యర్ధులు ఎన్నికల బరిలో దిగి ప్రజలలో చాలా గుర్తింపు పొందిన టిడిపి, వైసీపీ నేతలను ఎదుర్కోవాలంటే చాలా సాహసం చేయడంగానే భావించవచ్చు. అందుకే జనసేన తరపున పోటీ చేసే బలమైన అభ్యర్ధులను వేళ్ళపై లెక్కించవచ్చు. కనుక పోటీ చేయాలనుకొనేవారికి నియోజకవర్గాలను ఎంచుకొనే ఛాయిస్ కూడా ఉంటుంది.

మాజీ స్పీకర్, జనసేన రాష్ట్ర పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ శుక్రవారం పల్నాడు జిల్లా కొల్లిపరలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో నేను తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన, చిత్తశుద్ధి ఉండాలి. రాష్ట్రంలో కొల్లిపర మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాడానికి నా శక్తిమేర కృషి చేస్తాను,” అని అన్నారు.

నాదెండ్ల మనోహర్ పార్టీలో సీనియర్ నేత అయినప్పటికీ, వైసీపీ ప్రభుత్వంపై టిడిపి నేతలు పోరాడుతున్నట్లు పోరాడకపోవడం, కనీసం చిన్న విమర్శ కూడా చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయంలో జనసేనలో ఒక్క పవన్‌ కళ్యాణ్‌ గొంతు తప్ప నాదెండ్లతో సహా మరెవరిదీ వినబడదు.

ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేసుకొని సొంత పార్టీని బలోపేతం చేసుకోకుండా, ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడకుండా, అప్పుడప్పుడు ఈవిదంగా మీడియాతో నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతుంటే ఎన్నికలలో జనసేన ఎలా గెలుస్తుంది?వచ్చే ఎన్నికలకు టిడిపి, వైసీపీలు ఇప్పటి నుంచే అభ్యర్ధులను సిద్దం చేసుకొంటుంటే, జనసేన ఏం చేస్తోంది?ఒకవేళ టిడిపితో జనసేన పొత్తులు పెట్టుకొనే మాటయితే, తమకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి ఏం ప్రయోజనం?వాటిని వైసీపీకి పళ్ళెంలో పెట్టి అప్పగించడమే అవుతుంది కదా?కనుక ఇకనైనా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ముఖ్యనేతలు మేల్కొంటే వారికే మంచిది. లేకుంటే గత ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి.