YS Jagan Andhra Pradesh Three Capitalsవిశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునే విషయంలో చిత్తశుద్ధితో ఉన్నందునే రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలని సీఎం జగన్‌ నిర్ణయించారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అఖిలపక్ష బృందంలో చంద్రబాబును, టీడీపీకి చెందిన కార్మీకసంఘాల ప్రతినిధులను కూడా తీసుకుపోతామని చెప్పారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజనకు సంబంధించి కీలకాంశాలపై ఏరోజైనా అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలనే ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. అయితే తెలుగుదేశం నేతలు ఇందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. “స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం అయ్యింది. ఏమీ చెయ్యలేకపోయాడు అని మాట రాకుండా… దానిని అందరికీ అంటగట్టే ప్రయత్నమే ఈ అఖిలపక్షం,” అని వారు విమర్శిస్తున్నారు.

“నిజమే మా హయాంలో అఖిలపక్షాన్ని ఎప్పుడూ ఢిల్లీకి తీసుకుని వెళ్ళలేదు. రాజధాని శంకుస్థాపనకు పిలిస్తే వార్చలేని బుద్దితో రాని ప్రతిపక్ష నాయకుడు గనుకే జగన్ మీద ఎప్పటికీ నమ్మకం లేదు. అందుకే ఎప్పుడు తీసుకునివెళ్ళలేదు,” అని వారు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ విషయంగా ప్రధాని అప్పాయింట్మెంట్ ఇస్తారో లేదో అని అసలు ప్రశ్న.

మరోవైపు… స్టీల్‌ ప్లాంట్‌లో సమ్మె సైరన్‌ మోగనుంది. యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈనెల 25వ తేదీ తర్వాత సమ్మెకు వెళ్తామని కార్మికులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గేవరకు పోరాటం చేస్తామని కార్మికులు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం 14 రోజుల నోటీసు గడువు ఇచ్చారు.