is jagan kept vijaysai reddy on side    వైసీపీ ప్రభుత్వంలో, పార్టీలో సిఎం జగన్మోహన్ రెడ్డి తరువాత రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే అందరూ విజయసాయి రెడ్డి అనే చెపుతారు. కనుక ఇంతకాలం నా మాటే శాసనం అన్నట్లు చక్రం తిప్పేవారు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను మెల్లగా పక్కన పెట్టి ఆ స్థానంలోకి సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకువస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అలాగే టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

ఉత్తరాంద్ర జిల్లాల కన్వీనర్ పదవి నుంచి ఆయనను తప్పించి ఆ బాధ్యతలను వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలకు అప్పగించి, పెద్దగా ప్రాధాన్యత లేని పార్టీ అనుబంద సంఘాల బాధ్యతను విజయసాయి రెడ్డికి అప్పగించడమే ఇందుకు నిదర్శనం. ఉత్తరాంద్ర జిల్లాల కన్వీనర్‌గా పార్టీని బలోపేతం చేయాల్సిన ఆయన పార్టీ నేతలతో సత్సంబంధాలు నెరపకుండా వారిపై కర్ర పెత్తనం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.

ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో విజయసాయి రెడ్డి రెండో స్థానంలో ఉన్నప్పటికీ గత కొంతకాలంగా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకే వెళుతున్నారు. ఇటీవల మంత్రి పదవుల కోసం పార్టీలో అందరూ సజ్జల చుట్టూనే ప్రధాక్షిణాలు చేయడం అందరికీ తెలిసిందే. అలాగే ప్రభుత్వం తరపున మీడియాతో ఏమి మాట్లాడాలన్నా ఆయనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. కనుక వైసీపీ ప్రభుత్వంలో ఆయన రెండో స్థానంలోకి వచ్చినట్లు అర్దమవుతోంది.

అయితే సిఎం జగన్మోహన్ రెడ్డి గుట్టులన్నీ తెలిసిన విజయసాయి రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టగలరా?అంటే కాదనే చెప్పవచ్చు. ఆవిదంగా చేస్తే ఆయన జగన్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారే ప్రమాదం ఉంటుంది. కనుక ప్రస్తుతానికి విజయసాయి రెడ్డి ప్రాధాన్యతను కాస్త తగ్గించడం ద్వారా తనకు విధేయంగా ఉండాలని సిఎం జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు భావించవచ్చు. విజయసాయి రెడ్డి కూడా రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా వైసీపీ వ్యవహారాలలో ఆరితేరిపోయారు. కనుక ఆయన కూడా ప్రస్తుతానికి సర్దుకుపోయి సరైన సమయం, అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ విజృంభించవచ్చు.