Is it the end of the Gorantla Madhav Episodeప్రభుత్వాలు లేదా రాజకీయపార్టీలు ఏదైనా వివాదంలో చిక్కుకొన్నప్పుడు దానిపై నుండి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ప్రయత్నిస్తుంటాయి. వాటిని ఓ 3-4 నెలలు నాన్చితే అప్పటికి వేరే తాజా సమస్యలు, అంశాలు వచ్చేస్తాయి. అప్పటికి ఆ సమస్య లేదా వివాదం తీవ్రత తగ్గిపోతుంది కూడా. కనుక దాని గురించి మీడియా, ప్రతిపక్షాలు, ప్రజలు అందరికీ ఆసక్తి తగ్గిపోతుంది. అందరూ మరిచిపోతారు.

ఉదాహరణకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని వైసీపీ ప్రభుత్వం ముందే ఫిక్స్ అయిపోయింది కనుక అతని విషయంలో ఇదే టెక్నిక్ ఉపయోగించింది. ఇప్పుడు ఆ డర్టీ పిక్చర్ గురించి మీడియా, ప్రతిపక్షాలు మాట్లాడటం లేదు! ఎందుకంటే ఓ సినిమా ఎంత ఊపర్ హిట్ అయినప్పటికీ ఎవరూ మళ్ళీ మళ్ళీ దానిని చూడాలనుకోరు. గోరంట్ల డర్టీ పిక్చర్‌కి అదే వర్తిస్తుంది. ప్రజలు కూడా దాని గురించి మరిచిపోయే ఉంటారు లేదా ఆసక్తి కోల్పోయే ఉంటారు. ప్రజలకు ఆసక్తి కలిగిన తాజా అంశాలనే మీడియా అందించాలనుకొంటుంది కనుక మీడియా కూడా ఆ డర్టీ పిక్చర్‌ను పక్కన పడేసింది. వైసీపీ కోరుకొన్నది కూడా ఇదే కదా?

కానీ గోరంట్ల బంతాట ఇంకా ముగిసిపోలేదు. ఏపీకి చెందిన కొందరు మహిళా సంఘాలు, నేతలు, జాతీయమహిళా కమీషన్‌ సభ్యులు ఈ నెల 23న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముని, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లను కలిసి గోరంట్ల మాధవ్‌పై ఫిర్యాదు చేశారు. వారి పిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం వారి ఫిర్యాదు కాపీని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.

అయితే గోడకేసి కొట్టిన బంతిలా గోరంట్ల మాధవ్‌ వ్యవహారం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వద్దకే వచ్చినందున, దాని సమాధానం ఏవిదంగా ఉంటుందో అందరికీ తెలుసు. కనుక గోరంట్ల బంతాట ఇక్కడితో ముగిసినట్లే భావించవచ్చు.

Watch and subscribe for Exclusive Interviews: