Is it really possible for Jagan's bail revoked?ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయలంటూ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సిబిఐ కోర్టు లో విచారణ జరిగింది. అయితే కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది.

లాక్‌డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాదులు తెలుపగా… సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది….ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు.

అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని…జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశమే నిజంగానే ఉందని అందుకే ఈ కేసులో కౌంటర్ దాఖలు చెయ్యకుండా విచారణ ఆలస్యమయ్యేలా జగన్ చూసుకుంటున్నారని అంటున్నారు.

కేసు విచారణ జగన్ ఆలస్యం చెయ్యడంలో అర్ధం ఉంది. మరి ఈ విషయంలో సిబిఐ ఎందుకు ఆలస్యం చేస్తుందో? ఆ మేరకు జగన్ కు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే కౌంటర్ తో సంబంధం లేకుండా ఈ కేసు విచారణ జూన్ 1న మొదలు కానుండడంతో ఇక ఆలస్యం చేసే అవకాశాలు తక్కువే అని చెప్పుకోవాలి.