Pawan Kalyan BJPజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీలో బిజెపి పెద్దలని కలిసిన తర్వాత రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని జనసేన ట్వీట్‌ చేసింది. బిజెపి-జనసేన పొత్తులు, కార్యాచరణ గురించి ఢిల్లీ నుంచి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుకు కూడా ‘మార్గదర్శకాలు’ వచ్చిన్నట్లే ఉన్నాయి. బహుశః అందుకే ఇదివరకు పవన్‌ కళ్యాణ్‌ పేరు పలకడానికి కూడా ఇష్టపడని ఆయన జనసేనతో కలిసి పనిచేస్తామని, రెండు పార్టీల మద్య పొత్తులు బలంగానే ఉన్నాయని అన్నారు.

పొత్తులు ఉన్నందునే పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్ళి తమ అధిష్టానంతో భేటీ అయ్యారని చెప్పుకొన్న సోమూ వీర్రాజు, పవన్‌ కళ్యాణ్‌ వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలవడాన్ని పొత్తుల కోసమని భావించలేమని చెప్పడం విశేషం. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జనసేన-బిజెపిలు కలిసి పనిచేస్తాయని సోమూ వీర్రాజు అన్నారు.

ఏపీలో బిజెపికి సొంతంగా అధికారంలోకి రాలేదు కనుక పవన్‌ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అంగీకరించడానికి అభ్యంతరం ఉండదు. ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి కోరుకొంటున్నారు కనుక బిజెపి పెద్దల ఒత్తిడికి తలొగ్గి ఉండవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ కాపు ఓట్లను చంద్రబాబు నాయుడుకి తాకట్టుపెట్టబోతున్నారని వైసీపీ దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేస్తేనే రాష్ట్రంలో కాపులు, బడుగు బలహీనవర్గాల ప్రజలు జనసేనకు ఓట్లు వేస్తారని హరిరామజోగయ్య అన్నారు.

ఇవన్నీగాక జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటున్నారనే విషయం బిజెపి పెద్దలు పవన్‌ కళ్యాణ్‌ చెవిలో వేసి, టిడిపితో పొత్తులు పెట్టుకొని సీట్ల కోసం ప్రాధేయపడటం కంటే బిజెపితో కలిసి పోటీ చేస్తే 175 సీట్లలో ఎవరికి కావలసినన్ని వారు తీసుకోవచ్చని సలహా ఇచ్చి ఉండవచ్చు. కనుక ఇవన్నీ పవన్‌ కళ్యాణ్‌ని మళ్ళీ బిజెపికి దగ్గర చేసి ఉండవచ్చు.

సిఎం జగన్మోహన్ రెడ్డి కోరుకొంటున్నట్లుగా జనసేనను టిడిపికి దూరం చేసి, వైసీపీకి మార్గం సుగమం చేస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సోమూ వీర్రాజు హూంకరిస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది. ఏపీకి తీరని నష్టం జరుగుతున్నా పట్టించుకోని బిజెపి, కేంద్ర ప్రభుత్వం, వైసీపీని గద్దె దించడం కోసమే జనసేన పొత్తు పెట్టుకొంటోందంటే నమ్మశఖ్యంగా ఉందా? బిజెపి సాయంతో వైసీపీని గద్దె దించాలని పవన్‌ కళ్యాణ్‌ కోరుకొంటుండవచ్చు. కానీ ఆ వంకతో బిజెపి పవన్‌ కళ్యాణ్‌ని పావుగా వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది.