కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెనుక వైసీపీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కీలక భూమిక పోషించారా? అంటే అవుననే అంటున్నాయి ఏపీ పోలీసు వర్గాలు. కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలోని కొబ్బరి తోటల్లో ముద్రగడ ఏర్పాటు చేసిన కాపు ఐక్య గర్జనకు లక్షలాదిగా కాపు కులస్తులు తరలివచ్చారు. ఇక రోడ్డుపై తేల్చుకుందామన్న ముద్రగడ ఒక్కమాటతో వాతావరణం మారిపోయి, రోడ్డుపై వెళుతున్న పలు వాహనాలు, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు పైన విరుచుకు పడిన వైనం తెలిసిందే.
ఈ ఘర్షణలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసిన పోలీసులు… అసలు ఈ విధ్వంసం వెనుక సూత్రధారులుగా ఉన్నవారెవరన్న కోణంలో ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డికి సంబంధించిన పాత్రపై పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. అధికార పక్షం టీడీపీ కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తున్న క్రమంలో భూమన పాత్రకు సంబంధించి మరింత మేర స్పష్టమైన ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
ఇది నిరూపించగలిగితే, రాజకీయంగా జగన్ మరో మెట్టు క్రిందికి జారక తప్పని పరిస్థితి అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జగన్ పార్టీకి చెందిన నేతగానే కాక, జగన్ కు అత్యంత ఆప్తుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్న కరుణాకరరెడ్డి పేరు ఎప్పుడూ రాజకీయ వర్గాల్లో మారుమ్రోగుతూ ఉంటుంది. అలాంటిది ఆరోపణలు రుజువైతే, అవి తిరిగొచ్చి మళ్ళీ జగన్ ను చుట్టుకునే అవకాశం లేకపోలేదంటున్నారు పరిశీలకులు. దీంతో తుని విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.