ఇదేంటి వీర్రాజుగారు.... జనసేనను వదిలేసుకొంటారా?జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటన సందర్భంగా జగన్ ప్రభుత్వం, మంత్రులు, పోలీసులు వ్యవహరించిన తీరుపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. కానీ మిత్రపక్షంగా ఉన్న బిజెపి మాత్రం పెద్దగా స్పందించలేదు! ఇందుకు పవన్‌ కళ్యాణ్‌తో సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా ప్రస్తుత అధ్యక్షుడు సోమూ వీర్రాజుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

పవన్‌ కళ్యాణ్‌ మొదటి నుంచి బిజెపితో కలిసి పనిచేసేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నప్పటికీ సోమూ వీర్రాజు ఆయనను కలుపుకుపోలేకపోయారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన ఘటనలపై బిజెపి గట్టిగా స్పందించి ఉండాల్సిందని తద్వారా వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక పంపడమే కాకుండా పవన్‌ కళ్యాణ్‌ బిజెపికి దూరం కాకుండా ఉండేవారని కన్నా లక్ష్మినారాయణ అభిప్రాయపడ్డారు. కానీ పవన్‌ కళ్యాణ్‌కు నిజంగా అత్యవసరమైన సమయంలో రాష్ట్ర బిజెపి నిర్లిప్తంగా చూస్తుండిపోవడం వలననే ఆయనకు చంద్రబాబు నాయుడు దగ్గరయ్యారని, ఇద్దరూ కలిసి పనిచేసేందుకు సిద్దపడ్డారని కన్నా లక్ష్మినారాయణ అభిప్రాయం వ్యక్తం చేసారు.

మొన్న పవన్‌ కళ్యాణ్‌ విశాఖలో మాట్లాడుతూ, “నేను ప్రతీదానికి ఢిల్లీ పెద్దలను అడగలేను. ఇక్కడ రాష్ట్రంలో నాకు లక్షల మంది జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారితో కలిసి నేను పోరాడగలను,” అంటూ కేంద్రంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ రాష్ట్రంలో జనసేన, బిజెపిలు కలిసి పనిచేస్తున్నట్లయితే, వైసీపీ ప్రభుత్వం పవన్‌ కళ్యాణ్‌ని హోటల్‌ గదిలో నిర్బందించే సాహసం చేసి ఉండేది కాదు… పవన్‌ కళ్యాణ్‌ ఈవిదంగా అసహనం వ్యక్తం చేసి ఉండేవారూ కారని చెప్పవచ్చు.

అయితే సోమూ వీర్రాజు స్పందించకపోయినా కన్నా లక్ష్మినారాయణ స్పందించి మంచిపనే చేశారని చెప్పొచ్చు. కానీ ఏపీలో బిజెపి ఏవిదంగా ఎవరితో కలిసి ముందుకు సాగాలనే విషయంపై వీలైనంత త్వరగా నిర్ణయించుకొని తదనుగుణంగా పనిచేయడం ప్రారంభిస్తే ఆ పార్టీకి కూడా మంచిది. కాదని ఇలాగే గోడ మీద పిల్లిలా కూర్చొని ఆంధ్రప్రదేశ్‌లో నానాటికీ దిగజారుగుతున్న పరిస్థితులను ఎన్నికల వరకు నిర్లిప్తంగా చూస్తూ కూర్చోంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎలాగూ తీవ్రంగా నష్టపోతోంది… బిజెపి కూడా అందుకు మూల్యం చెల్లించాల్సి రావచ్చునని గ్రహిస్తే మంచిది.