IS Alliance with BJP is really Necessaryచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యంగా… ప్రధాని నరేంద్రమోడీతో ఎంత సఖ్యతగా ఉండేవారో మూడేళ్ళ తర్వాత కారణాలు ఏవైతేనేమి… శత్రువుగా మార్చుకొన్నారు. దానికి చాలా భారీగా మూల్యం చెల్లించుకొన్నారు కూడా. కేంద్రంతో సఖ్యతగా ఉండటం ఎంత అవసరమో తెలుసుకొనేసరికే సమయం మించిపోయింది. అయితే ‘ఒక్క ఛాన్స్’తో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈవిషయం బాగానే అర్దం చేసుకొన్నారు. అందుకే వీరవిధేయంగా మెలుగుతూ రోమ్ చక్రవర్తిలా హాయిగా కాలక్షేపం చేసేస్తున్నారు.

టిడిపితో పొత్తులు అవసరం లేదని ఏపీ బిజెపి చెప్పేసింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనకి వచ్చినప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కి అండగా నిలబడతామని హామీ ఇచ్చిన్నట్లు కూడా స్పష్టమైంది. అలాగని రాష్ట్ర బిజెపి నేతలు వైసీపీతో కత్తులు దూసి యుద్ధానికి సన్నదం అవుతున్నట్లు కూడా లేదు. అంటే ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే దానితోను, జనసేన వస్తే దానితోనూ సాగాలని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లున్నారు.

అయితే జనసేనకు బిజెపి, కేంద్ర ప్రభుత్వం రెండూ అండగా నిలబడినప్పటికీ రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవనే చెప్పొచ్చు. బహుశః అందుకే టిడిపితో పొత్తుల గురించి పవన్‌ కళ్యాణ్‌ ఆలోచిస్తునట్లు భావించవచ్చు. అయితే టిడిపితో జనసేన పొత్తు పెట్టుకోదలిస్తే అప్పుడు బిజెపి ఏం చేస్తుంది?అని ఆలోచిస్తే వైసీపీవైపే మొగ్గు చూపవచ్చని అర్దం అవుతోంది. వచ్చే ఎన్నికలలో బిజెపి ప్రత్యక్షంగా వైసీపీతో పొత్తులు పెట్టుకోకపోయినా ఇప్పటిలాగే అవసరమైనప్పుడు దాని సహాయసహకారాలు తీసుకోవచ్చు. కనుక ఇక ఎట్టి పరిస్థితులలో టిడిపితో మళ్ళీ పొత్తులు పెట్టుకొనే అవకాశం లేదని అర్దం అవుతోంది.

ఇంత స్పష్టత వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా చంద్రబాబు నాయుడుని ఢిల్లీలో జరిగే కీలక సమావేశాలకు ఆహ్వానిస్తుండటం ఆశ్చర్యకరమే. కేంద్రమే ఆహ్వానించి ప్రధాని నరేంద్రమోడీతో భేటీకి అవకాశం కల్పిస్తున్నప్పుడు మొండిగా తిరస్కరించడం సరికాదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారేమో?

ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరుతున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు గన్నవరం నుంచి బయలుదేరుతున్నారు. ఈసారి జీ20 సదస్సు భారత్‌లో నిర్వహించబోతున్నందున దాని గురించి చర్చించేందుకు అన్ని రాష్ట్రాలలో ప్రధాన పార్టీల అధినేతలను ఢిల్లీకి ఆహ్వానించారు.

అయితే టిడిపితో పొత్తులు అవసరం లేదని ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర బిజెపి నేతలు ఖరాఖండీగా చెపుతున్నప్పుడు ఇంకాఎదురుచూపులు అవసరమా?అనే సందేహం కలుగుతుంది. బిజెపితో పొత్తుల కోసం ఎదురుచూసే బదులు ఇప్పటి నుంచే వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్దపడి, అందుకు తగ్గ సన్నాహాలు చేసుకోవడమే మంచిది కదా?