Irrfan - Khan is no moreబాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ ఇక లేరు. పెద్ద‌పేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, నిన్న రాత్రి పరిస్థితి విషమించడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ఐసియూలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ కుటుంబసభ్యులను, అభిమానులను శోకసముద్రంలో ముంచి బుధవారం ఉదయం మరణించారు.

ఆయన చివరి శ్వాస విడిచినప్పుడు కుటుంబసభ్యులు ఆయన పక్కనే ఉన్నట్టు సమాచారం. కేరీర్ మొదట్లో బుల్లితెరపై పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్‌ ‘సలామ్ బాంబే’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ‘పాన్ సింగ్ తోమర్’ చిత్రానికి ఉత్తమ నటుడుగా ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు.

ఇర్ఫాన్‌కు 2011లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఒకసారి జాతీయ పురస్కారం, 4 సార్లు ఫిలింపేర్ అవార్డులు దక్కాయి. అలాగే చాలా హాలీవుడ్ సినిమాలలో కూడా ఆయన నటించారు. ఆయన చివ‌రిగా ‘అంగ్రేజీ మీడియం’ లో ముఖ్యపాత్రలో నటించారు. ఇర్ఫాన్‌ ఖాన్‌ త‌ల్లి సైదా బేగం శ‌నివారం మృతి చెందారు.

అటు లాక్‌డౌన్‌తోపాటు ఇటు ఆయన ఆరోగ్యం కూడా బాగోలేక‌పోవ‌డంతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే త‌ల్లిని క‌డ‌సారి చూసుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబంలో రెండో విషాదం చోటు చేసుకుంది. ఇర్ఫాన్ కన్నుమూతతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.