Ippatam-YSR-Statue-రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష సాధింపులే విధానంగా పని చేస్తున్న వైసీపీ ప్రభుత్వం అప్పుడప్పుడు ప్రత్యర్ధుల కోసం తవ్విన గోతుల్లో తనే పడుతుంతుంటుంది. జనసేన సభకి స్థలం ఇచ్చినందుకు ఇప్పటం గ్రామస్తులపై కక్షకట్టిన వైసీపీ ప్రభుత్వం గొప్ప తెలివిగా వ్యవహరిస్తున్నామనుకొంటూ రోడ్లు విస్తరణ పేరుతో గ్రామస్తుల ఇళ్ళు కూల్చివేసింది. అయితే వారికి గుణపాఠం నేర్పాలనే హడావుడిలో ఆ గ్రామంలో రోడ్డు పక్కనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉందనే సంగతి అందరూ మరిచిపోయారు. హడావుడిగా జేసీబీతో ఇళ్ళు కూల్చేసాక రోడ్డు పక్కనే ఉన్న ఆ విగ్రహం మీద అందరి దృష్టి పడింది. కానీ ఆ విగ్రహాన్ని తొలగింకే ధైర్యం చేయలేకపోయారు.

ఇంతలోనే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటం గ్రామంలో పర్యటించి రోడ్డు పక్కనే ఉన్న వైఎసార్ విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదని నిలదీయడంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే కొన్ని ఇళ్ళ ప్రహారీ గోడలు మాత్రమే కూల్చేశామని వాదిస్తున్న వైసీపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లయింది.

నిన్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ కూడా ఇప్పటం గ్రామంలో పర్యటనకు వస్తున్నట్లు తెలియడంతో మళ్ళీ ఆయన కూడా ఇదే విషయం ప్రస్తావించి విమర్శిస్తారని, రోడ్డు పక్కనే ఉన్న వైఎసార్ విగ్రహాన్నితొలగించాలని అధికారులను ఆదేశించడంతో జేసీబీతో విగ్రహం దిమ్మెను కూల్చివేసి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఎవరు తీసిన గోతిలో వారే పడటం అంటే ఇదేకదా?

వైసీపీ తన రాజకీయ ప్రత్యర్ధులతో ఎన్ని రాజకీయాలు చేసుకోవచ్చు కానీ ఇలా సామాన్య ప్రజలపై కూడా కక్షపూరితంగా వ్యవహరించడమే సరికాదు. కక్ష సాధింపు చర్యలకి కూడా వైసీపీ ప్రభుత్వం ఇటువంటి ఓ ఫార్ములా కనిపెట్టింది. కానీ ఇలాంటి ఫార్ములాలే ఓ చెడు ఆనవాయితీగా మారిపోతే భవిష్యత్‌లో వైసీపీ కూడా మూల్యం చెల్లించుకోక తప్పకపోవచ్చు. అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన తరుణంలో ఇటువంటి ఫార్ములతో ముందుకు సాగుతుంటే రేపు రాష్ట్రం పరిస్థితి ఏవిదంగా మారుతుందో?