Ippatam_Village_Building_Demolishగత ఏడాది జనసేన ఆవిర్భావసభ నిర్వహించుకోవడానికి ఇప్పటం గ్రామంలో ఓ రైతు స్థలం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామానికి 100 అడుగుల రోడ్డుని బహుమతిగా ఇచ్చింది! అందుకు సంతోషించాల్సిన గ్రామస్తులు లబోదిబోమని మొత్తుకొన్నారు… ఆ కధేమిటో అందరికీ తెలుసు.

రోడ్డు వెడల్పు పేరుతో ఇప్పటం గ్రామంలో పలువురి ఇళ్ళు కూల్చివేయడం, అప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వచ్చి ఇంటిలో లక్ష చొప్పున నష్టపరిహారం పంచడం, అందుకు కారు టాపుమీద కూర్చొని ప్రయాణించాడని పోలీసులు ఆయనపై కేసు పెట్టడం… ఇదంతా చాలా పాత స్టోరీ!

అయితే ఆ స్టోరీ ఇంకా పూర్తికాలేదని వైసీపీ ప్రభుత్వం చెపుతోంది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు శనివారం ఉదయం రెండు జేసీబీలను వెంటబెట్టుకువచ్చి ఇప్పటం గ్రామంలో మరో 12 ఇళ్ళ ప్రహారీ గోడలు కూల్చివేశారు. వాటిలో జనసేన గ్రామ అధ్యక్షుడు నరసింహారావు ఇల్లు కూడా ఉండటం యాదృచ్ఛికమే అని సరిపెట్టుకోక తప్పదు.

జేసీబీలతో ఇళ్ళు కూల్చివేస్తుండటంతో గ్రామస్తులు మళ్ళీ లబోదిబోమని మొత్తుకొంటున్నారు. నేటికీ ఆటోలే తప్ప బస్సు సౌకర్యం కూడా లేని తమ గ్రామంలో 100 అడుగుల రోడ్డు దేనికి? ఆ పేరుతో తమ ఇళ్ళని ఎందుకు కూల్చివేస్తున్నారంటూ గ్రామస్తులు అధికారులను నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటం గ్రామాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలని పట్టుదలగా ఉందనే విషయం వారికి అర్దం కావడం లేదు. అందుకే అధికారులతో వాగ్వాదాలకు దిరుగుతున్నారు.

అయితే అధికారులు ఇందుకు సిద్దపడే పోలీసులను వెంటబెట్టుకొని వచ్చారు కనుక గ్రామస్తులను పోలీసులు నియంత్రిస్తుంటే సిబ్బంది ఇళ్ళ కూల్చివేతలు కొనసాగించారు. ఈ విషయం తెలిస్తే మళ్ళీ టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు వచ్చి పడతారని, గ్రామం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. బయటవారిని ఎవరినీ గ్రామంలోకి అనుమతించడంలేదు. ఇప్పటం గ్రామంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ గ్రామాన్ని ఇంతగా అభివృద్ధి చేస్తున్నందుకు వచ్చే ఎన్నికలలో గ్రామస్తులు వైసీపీకే ఓట్లు వేస్తారో లేదో చూడాలి.