Ippatam_Roads_wideningఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆరోజు మచిలీపట్నంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభ నిర్వహించుకొనేందుకు కొంతమంది రైతులు 34 ఎకరాలు ఇచ్చారని, తమ అభ్యర్ధనపై మరో 60 ఎకరాలు ఇచ్చారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారందరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

ఈ సభకు దాదాపు లక్షమందికి పైగా జనం వస్తారని భావిస్తున్నామని తెలిపారు. నభూతో నభవిష్యత్ అన్నరీతిలో పార్టీ ఆవిర్భావసభని నిర్వహిస్తామని, ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా శ్రమించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. వైసీపీ పాలనలో తీవ్రంగా దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పూర్వవైభవం కల్పించాలనే జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తపిస్తున్నారని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ముందు రోజున హైదరాబాద్‌ నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయం చేరుకొని పార్టీ నేతలతో అన్ని విషయాలపై చర్చిస్తారని, మర్నాడు అక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి సభాస్థలికి చేరుకొంటారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

గత ఏడాది వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పినా ఇప్పటం గ్రామంలో రైతులు జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారు. దాంతో వారిపై కక్షకట్టిన వైసీపీ ప్రభుత్వం ఆ మారుమూల గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అనేకమంది ఇళ్ళను కూల్చివేశారు. ఇటీవల మరోసారి ఇప్పటం గ్రామంపై దండయాత్ర చేసి మరో 12 ఇళ్ళ ప్రహారీగోడలను జేసీబీలతో కూల్చేయించారు.

ఇప్పుడు మచిలీపట్నంలో రైతులు జనసేన బహిరంగసభ నిర్వహించుకోవడానికి 94 ఎకరాలు ఇచ్చినందున, ప్రభుత్వం త్వరలోనే వారి ఇళ్ళ మద్య రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడుతుందేమో?కనుక గుంతలు పడిన రోడ్లకు మరమత్తులు చేయమని ప్రజలు ఎంత మొరపెట్టుకొన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కనుక ప్రతీ పట్టణం, గ్రామంలో జనసేన సభలు నిర్వహించుకొంటే ఏకంగా కొత్త రోడ్లు వస్తాయేమో?