ipl-mumbai-indians-vs-royal-challengers--bangaloreఇండియన్ ప్రీమియర్ లీగ్ పండగలో ప్రస్తుతం క్రికెట్ అభిమానులు మునిగి తేలుతున్నారు. మంగళవారం నాడు తలపడిన ముంబై ఇండియన్స్ – బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ వార్ వన్ సైడ్ గా మారిపోయింది. ఈ సీజన్ లో ముంబైకున్న ట్రాక్ రికార్డ్ రీత్యా మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని భావించిన క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ నిరుత్సాహాన్ని మిగిల్చింది. వరుసగా మూడు మ్యాచ్ లు చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగి, ఓటమి పాలైన ముంబై, ఈ మ్యాచ్ లో అలవోకమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

టాస్ ఓడి మళ్ళీ బ్యాటింగ్ కు దిగిన ముంబైకు తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోగా, ఆ తర్వాత రోహిత్ శర్మ – లూయిస్ ల జోడి 100 పరుగుల మైలురాయిని దాటించారు. ఈ క్రమంలో భారీ షాట్లతో విరుచుకుపడుతున్న లూయిస్ (42 బంతుల్లో 65 పరుగులు) చేసి వెనుదిరిగాడు. మరో ఎండ్ లో ఉన్న రోహిత్ (52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 94 పరుగులు) మాత్రం అదే దూకుడును ప్రదర్శిస్తూ ముంబైను 213 పరుగుల భారీ స్కోర్ దిశగా నడిపించాడు. చివర్లో హార్దిక్ పాండ్య 5 బంతుల్లో 17 పరుగులు చేసి తన వంతు పాత్రను పోషించాడు.

ఇక భారీ లక్ష్యాన్ని గ్రాండ్ గా ఆరంభించిన బెంగుళూరు తొలి 4 ఓవర్లలో 40 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓపెనర్ డీకాక్ (19) వికెట్ కోల్పోగా, బెంగుళూరు గాడి తప్పింది. ఓ ఎండ్ లో విరాట్ కోహ్లి (62 బంతుల్లో 92 పరుగులు నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా, మరో ఎండ్ లో ఒక్క బ్యాట్స్ మెన్ కూడా క్రీజులో నిలదొక్కుకోకపోవడం గమనార్హం. దీంతో నిర్ణీత ఓవర్లలో బెంగుళూరు కేవలం 167 పరుగులను మాత్రమే చేయగలిగింది. ఈ సీజన్ లో తొలి విజయాన్ని సొంతం చేసుకున్న ముంబై, మెరుగైన రన్ రేట్ తో 2 పాయింట్లతో బెంగుళూరు, ఢిల్లీ జట్ల సరసన నిలిచింది.