IPL mumbai indians historyఒకప్పుడు టీమిండియా ‘పేపర్’ మీద ఎంత బలంగా ఉండేదో, ‘ఫీల్డ్’లో అంత బలహీనంగా ఉండేది. దాదాపుగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా ఇంతే. జట్టు నిండా స్టార్ క్రికెటర్లు ఉన్నా ఒత్తిడికి గురయ్యి, మ్యాచ్ లను చేజార్చుకోవడం ముంబై ఇండియన్స్ కు వెన్నతో పెట్టిన విద్య. అలాగే తొలుత బ్యాటింగ్ చేసిన సమయాల్లో కనీసం పోరాటపటిమను ప్రదర్శించే స్థాయి ఆట తీరును కూడా కనపరచలేకపోవడం ముంబై జట్టు అభిమానులకు తీవ్ర ఆవేదనను మిగులుస్తోంది.

ఈ ఏడాది ప్రారంభమైన తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం పాలైన ముంబై ఇండియన్స్, రెండవ మ్యాచ్ లో రికార్డు లక్ష్యాన్ని చేధించి కోల్ కోత పై ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మది కీలక పాత్ర కాగా, బట్లర్, మెక్ క్లింగన్ వంటి వారు దూకుడైన ఆటతీరుతో ముంబై విజయానికి కారణమయ్యారు. అయితే గత 8 సీజన్లలో జరిగిన ఆట తీరును గమనిస్తే ముంబై జట్టు కెప్టెన్ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చిన సమయంలోనే ఎక్కువ విజయాలు సొంతం చేసుకుంది.

సచిన్ సారధ్యంలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు తొలి సీజన్లలో ఘోర పరాజయాలను చవిచూసింది. అయితే ఎప్పుడైతే సచిన్ తన బ్యాటింగ్ విన్యాసాలు చూపించడం ప్రారంభించారో అప్పటి నుండి ముంబై జట్టు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ వరకు చేరుకుంది. అలాగే గత రెండు సీజన్లుగా కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తున్న రోహిత్ శర్మ విషయంలోనూ అదే జరుగుతోంది. రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ తీరు ప్రదర్శించినపుడు అలవోకగా విజయాలు సొంతం చేసుకుంటున్న ముంబై, ఇతర సమయాల్లో మాత్రం పేలవమైన ఆట తీరుతో అభిమానుల ఆవేదనకు కారణమవుతోంది. సచిన్ అండగా ఉన్న జట్టుగా ముంబైకు దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది.