IPL-Delhi-Daredevils-vs-Mumbai-Indiansగత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ రసవత్తర దశకు చేరుకుంది. టాప్ 4లో ఏయే జట్లు స్థానం సంపాదించుకోబోతున్నాయనే కీలక దశలో మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. టాప్ 4లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఉండడం దాదాపుగా ఖాయమే. హైదరాబాద్ కు చేతిలో ఇంకా 5 మ్యాచ్ లు ఉండగా, కేవలం ఒకటి లేక రెండు విజయాలు మాత్రమే కావాల్సి ఉంది.

చెన్నై పరిస్థితి కూడా అలాంటిదే. చేతిలో ఇంకా నాలుగు మ్యాచ్ లు ఉండగా, చెన్నైకు కూడా ఒకటి లేక రెండు విజయాలు మాత్రమే కావాల్సి ఉంది. ఇక మిగిలిన రెండు స్థానాలలో ప్రస్తుతానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు నిలువగా, టాప్ 4లో స్థానం సంపాదించుకునే అవకాశం మరో మూడు జట్లకు కూడా ఉంది. అందులో ప్రధానంగా మెరుగైన రన్ రేట్ తో ముంబై ఉండగా, ఆ తర్వాత బెంగళూరు, రాజస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.

ఉన్న 8 జట్లల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అధికారికంగా టాప్ 4 నుండి వైదొలగినట్లే. అలాగే ముంబై, బెంగుళూరు, రాజస్తాన్ కు మిగిలి ఉన్న అన్ని మ్యాచ్ లలోనూ విజయాలు సాధిస్తే గనుక, ఈ మూడింటికి అవకాశం ఉన్నట్లే. కానీ ఈ మూడింటి నడుమ మ్యాచ్ లు జరగనున్నాయి గనుక, పంజాబ్ కు టాప్ 4 అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ బెంగుళూరుకు డు ఆర్ డై లాంటిది.