IPL2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ముంబై వేదికగా ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడిన చెన్నై, 179 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలోనే చేధించి ఐపీఎల్ కప్ ను ఎగురవేసుకుపోయింది. ఈ విజయ సాధనలో వాట్సన్ (57 బంతుల్లో 117 పరుగులు) చేసి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.

తొలి 10 బంతులలో ఒక్క రన్ కూడా చేయలేకపోయిన వాట్సన్, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి, కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంటే 41 బంతుల్లోనే 100 పరుగులు చేయడంతో హైదరాబాద్ అందించిన లక్ష్యం వాట్సన్ బ్యాటింగ్ ముందు చిన్నబోయింది. మరో ఎండ్ లో రైనా 32, రాయుడు 17 పరుగులు చేసి చేయూతను అందించడంతో కేవలం 2 వికెట్లు కోల్పోయి మాత్రమే ఈ విజయాన్ని అందుకుంది.

దీంతో ఐపీఎల్ కప్ ను మూడవ సారి ధోని సేన అందుకుంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మాత్రమే మూడు సార్లు ఐపీఎల్ ను సొంతం చేసుకోగా, ఈ విజయంతో చెన్నై కూడా ముంబై సరసన నిలిచింది. ఇక రెండవ సారి ఐపీఎల్ ట్రోఫీను సొంతం చేసుకోవాలనుకున్న హైదరాబాద్ ఆశలపై వాట్సన్ నీళ్ళు జల్లాడు. అంతకుముందు బ్యాటింగ్ విభాగంలో విలియమ్సన్ 47, యూసుఫ్ పటాన్ 45 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ నైనా నమోదు చేయగలిగింది.