IPL-Final-2017-Mumbai-Indians-won-the-trophyఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 హంగామా ముగిసింది. నాటకీయ పరిణామాల మధ్యలో పూణేపై ముంబై జయకేతనం ఎగురవేసి, మూడవ సారి ట్రోఫీని ఎగురేసుకుపోయింది. అయితే ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతోందా? ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే… డబ్ల్యూడబ్ల్యూఈ… ఓ పక్కా స్క్రిప్ట్ అన్నది అందరికీ తెలిసిందే. ముందుగా ఎవరు గెలుస్తారో కూడా మేనేజ్మెంట్ నిర్ణయించిన తర్వాత, రెజర్లు అందుకు అనుగుణంగా రింగ్ లో కాసేపు కొట్లాడుకుని వెళ్లిపోవాలి. అయితే ఇదంతా ప్రేక్షకులను రంజింపచేసే విధంగా ఆసక్తికరంగా డిజైన్ చేస్తారు.

మరి ఇండియాలో ఒక ‘మతం’గా భావించే క్రికెట్ కూడా అలాగే తయారయ్యిందా? అలాంటి సందేహాలకు, ప్రశ్నలకు ఐపీఎల్ తావిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగిన తీరుపై అనేక ప్రశ్నలు సామాన్య ప్రేక్షకుల మదిలో మెదులుతున్నాయి. కేవలం 130 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి మ్యాచ్ ను రసవత్తరంగా మార్చేసారని, ఎప్పుడూ బౌలర్లపై విరుచుకుపడే స్మిత్, ఆచితూచి ఆడి మ్యాచ్ ముంబై నుండి చేజారకుండా చూసుకున్నారని… ఇలా ఒకటేమిటి… అనేక సందేహాలు ఈ ఐపీఎల్ ఫైనల్ మిగిల్చింది.

ఇక్కడే ఓ విషయం చెప్పాలి. ఐపీఎల్ మ్యాచ్ ల పైన దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ లు జరుగుతున్నాయని రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. మరి అంతటి బెట్టింగ్ లు జరిగే మ్యాచ్ లను ‘వన్ సైడ్’ చేసేస్తే… ఉపయోగం ఉండదు గనుక, మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అన్నది చివరి ఓవర్ వరకు చెప్పలేని విధంగా, ఉత్కంఠభరితంగా పక్కా స్క్రిప్ట్ ప్రకారం తీసుకువెళ్తున్నారనేది ప్రధాన సందేహం. సోషల్ మీడియాలో కూడా దీనిపై చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే నిజం అని ఒక్క క్షణం భావిస్తే… మనం చూస్తున్నదంతా ముందుగానే డిసైడ్ అయిపోయిందా అన్న ఆలోచనకు వస్తే… మనం అభిమానించే క్రీడాకారులు కోహ్లి, ధోని, రోహిత్ శర్మ… ఇలా ఒకరేమిటి… జట్టుకు 20 మంది చొప్పున దాదాపుగా 160 మంది ప్లేయర్లు అంతా సినీ ఫక్కీలో నాటకీయ పాత్రను పోషిస్తున్నారా అని తలస్తే… ఒక్కసారిగా క్రికెట్ పై మక్కువ పోతుంది. అవును… అదే జరుగుతుంది. కానీ ఇది అమలు సాధ్యమా? అన్న ఒక్క ప్రశ్న వస్తే మాత్రం… ఆలోచనకే భయంకరంగా ఉండడం సహజం!

అయితే ఇలాంటి అనేక ప్రశ్నలకు మాత్రం ఐపీఎల్ తావిస్తోంది. ‘క్రికెట్ లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు’ అనేది క్రికెట్ పండితులు చెప్పే విషయం. ఇందులో వాస్తవం లేకపోలేదు. కానీ ఎప్పుడూ, ఎక్కడా జరగని నాటకీయ పరిణామాలు ఐపీఎల్ లో మాత్రమే చోటు చేసుకుంటుండడం తావిస్తోంది. దీనికి బలాన్నిచ్చే విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలు బయటకు వస్తున్నాయి. ఈ ఆరోపణలతోనే గతంలో చెన్నై, రాజస్తాన్ జట్లు రెండేళ్ళ పాటు నిషేదానికి గురి కాగా, తాజాగా ఈ సీజన్ లో గుజరాత్ లయన్స్ లోని ఓ ఇద్దరు ఆటగాళ్ళపై మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

అలాగే ఐపీఎల్ లో చూసినంత దారుణమైన ఎంపైరింగ్ మరెక్కడా చూడకపోవడం ఆలోచించాల్సిన విషయమే. బహుశా ఇదే తరహా ఎంపైరింగ్ అంతర్జాతీయ స్థాయిలో చేస్తే… అది మీడియాలో, ఐసీసీలో ఓ హాట్ హాట్ టాపిక్ అయ్యుండేదని బల్లగుద్ది చెప్పవచ్చు. అంత దారుణంగా ఎంపైర్లు తమ నిర్ణయాలను ప్రకటించడం ప్రేక్షకులను విస్మయానికి గురి చేసే అంశం. వీటికి తోడు “అతి తేలిక క్యాచ్”లను కూడా పట్టుకోలేక క్రికెటర్లు తడబాటుకు గురి కావడం బహుశా ఐపీఎల్ లోనే జరుగుతుందని చెప్పుకోవాలేమో!

అయితే ఇలా ఐపీఎల్ సీజన్ ఆద్యంతం 60కి పైగా మ్యాచ్ ల పాటు 160 మంది క్రీడాకారులతో సంప్రదింపులు జరిపి ప్రేక్షకులను రంజింప చేసే విధంగా వ్యూహరచన చేయడం సాధ్యమేనా? ఖచ్చితంగా అసాధ్యం అని చెప్పవచ్చు. మరి ఎలా ఇన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని అనుకుంటే… దానికి సమాధానమే… క్రికెట్ లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు… అంతే..! అంతకు మించి ఎక్కువగా ఆలోచిస్తే… క్రికెట్ ను ఎంజాయ్ చేయడం మరిచిపోతారంతే..!