IPL-Delhi-Daredevils-vs-Mumbai-Indiansగతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు, ఈ ఏడాది వరుసగా మూడు మ్యాచ్ లలో ఓటమి పాలయ్యింది. విశేషం ఏమిటంటే… ఈ మూడు మ్యాచ్ లలోనూ చివరి ఓవర్ చివరి బాల్ వరకు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండడం! ముంబై మ్యాచ్ లంటే థ్రిల్లింగ్ ఫినిష్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ… చివరికి ముంబై ఓటమి పాలవడం జరుగుతోంది.

తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ లోనూ ఇదే రకమైన ఆట తీరుతో మ్యాచ్ ను అయితే రంజింప చేయగలిగింది గానీ, ఈ సీజన్ లో ఫస్ట్ విక్టరీని నమోదు చేసుకోలేకపోయింది. వరుసగా మూడో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 194 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఒక దశలో 220 పరుగులు చేస్తుందని భావించగా, చివరి 4 ఓవర్లలో ఏకంగా 5 వికెట్లను కోల్పోయి కేవలం 30 పరుగులను మాత్రమే చేసింది.

ఇక లక్ష్య చేధనలో ఢిల్లీ ఆది నుండి దూకుడైన ఆట తీరును ప్రదర్శించింది. ముఖ్యంగా ఫస్ట్ మ్యాచ్ ఆడుతోన్న జాసన్ రాయ్ ఢిల్లీ ఇన్నింగ్స్ కు వెన్నమూకలా నిలిచాడు. కీలకమైన తరుణంలో ఢిల్లీ బ్యాట్స్ మెన్లు ఇచ్చిన క్యాచ్ లను పట్టుకోవడంలో విఫలమైన ముంబై, ఓటమిని కొనితెచ్చుకుంది. ముఖ్యంగా ఒకే ఓవర్ లో జాసన్ రాయ్ మరియు శ్రేయాస్ అయ్యర్ లు ఇచ్చిన క్యాచ్ లను ముస్తాఫీజుర్ వదిలేయడం ముంబైకు శాపంగా మారింది.

చివరి ఓవర్ చేరుకునే సమయానికి విజయానికి 11 పరుగుల దూరంలో ఉండగా, ముస్తాఫీజుర్ వేసిన తొలి రెండు బంతులను 4, 6 గా మలిచి రాయ్ విజయాన్ని ఖాయం చేసాడు. కానీ తర్వాత మూడు బంతులను డాట్స్ గా ఆడడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అయితే చివరి బంతిని గాల్లోకి లేపి రెండు పరుగులు తీయడంతో, ఈ సీజన్ లో ఢిల్లీకి మొదటి విజయం నమోదైంది.