Kamlesh Nagarkotiఐపీఎల్ పుణ్యమా అని టీమిండియా అండర్-19 ఆటగాళ్లు ఒక్క దెబ్బకు కోటీశ్వరులుగా మారిపోయారు. అండర్-19 ప్రపంచకప్‌లో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్న 18 ఏళ్ల కమలేష్ నాగర్‌ కోటిని శనివారం జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఏకంగా 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఖరీదైన అండర్-19 ఆటగాడు కమలేషే. నాగర్‌కోటి కనీస ధర 20 లక్షలు కాగా ఏకంగా 3.2 కోట్లు పలకడం విశేషం.

అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీషాను ఢిల్లీ డేర్ డెవిల్స్ 1.2 కోట్లకు కొనుగోలు చేసింది. పృథ్వీ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ పోటీ పడగా చివరికి 1.2 కోట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ 1.8 కోట్లకు కొనుగోలు చేసింది. వీరిద్దరి బేస్ ప్రైస్ 20 లక్షలు కాగా కోటి రూపాయలకు పైగా పలకడం విశేషం.

ఇదిలా ఉంటే మరోవైపు ప్రపంచ మేటి క్రికెటర్లను దక్కించుకోవడానికి ఏ జట్టు ముందుకు రాకపోవడం విశేషం. విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా, ముఖ్యంగా టీ-20 క్రికెట్ లో అతి తక్కువ బంతుల్లోనే అత్యధిక పరుగులు సాధించే వీరుడిగా పేరున్న వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ను, ఐపీఎల్ 11వ సీజన్ లో తమ టీములో చేర్చుకోవడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తిని చూపలేదు. ఒక్క గేల్ మాత్రమే కాదు… హషీమ్ ఆమ్లా, గుప్తిల్, ఫాల్కనర్, రూట్, విజయ్ వంటి ఎంతో మంది ప్రముఖ క్రికెటర్లు కూడా అమ్ముడు పోలేదు.

శనివారం నాడు ఐపీఎల్ 11వ సీజన్ నిమిత్తం ఆటగాళ్ల వేలాన్ని ప్రారంభించగా, దాదాపు 300 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. మొత్తం 1000 మందికి పైగా ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు సంతకాలు చేశారు. ఇక నేడు రెండో రోజు ఆటగాళ్ల వేలం కొనసాగనుండగా, నిన్న అమ్ముడు పోని ఆటగాళ్ల కనీస ధరను తగ్గించి నేడు వేలం వేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.