IPl 2018 -Kolkata Knight Riders vs Mumbai- Indiansఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో దారుణ పరాజయాలతో అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపరిచిన జట్లల్లో ముంబై ఇండియన్స్ ఒకటి. తొలుత ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక్క విజయాన్ని అందుకుని, దాదాపుగా టోర్నీ నుండి నిష్క్రమించిందని భావించిన నేపధ్యంలో… తాజాగా కోల్ కతాపై విజయాన్ని సొంతం చేసుకుని టాప్ 4లోకి ప్రవేశించింది. గతంలో ఇలాంటి అనుభవాలు ముంబై చవిచూసినప్పటికీ, ఈ ఏడాది కనపరిచిన ఫాం రీత్యా, ఖచ్చితంగా టోర్నీ నుండి అవుట్ అయిపోతుందేమోనని భావించారు.

గడిచిన మూడు మ్యాచ్ లలో ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు చేసుకున్న ముంబై ఖాతాలో ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి. ఇంకా చేతిలో మూడు మ్యాచ్ లు ఉండగా, ఈ మూడింటిలోనూ విజయం సాధిస్తే టాప్ 4లో ముంబై నిలుస్తుంది. ఇతర జట్ల కంటే మెరుగైన రన్ రేట్ కలిగి ఉండడం ముంబైకు మరో అడ్వాంటేజ్. నాలుగవ స్థానం కోసం కోల్ కతాతో పాటు, రాజస్తాన్ రాయల్స్ జట్లు కూడా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే సన్ రైజర్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కాగా, మరో విజయం సాధిస్తే చెన్నై కూడా ప్లే ఆఫ్స్ బరిలో నిలుస్తుంది.

ఇక కోల్ కతా వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై, ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 62 పరుగులు) మెరుపు బ్యాటింగ్ తో నిర్ణీత ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. లక్ష్య చేధనలో ఏ మాత్రం పోటీని ప్రదర్శించని కోల్ కతా కేవలం 108 పరుగులకు ఆలౌట్ అవడంతో, 102 పరుగుల భారీ విజయం ముంబై సొంతమైంది. ఊహించని విధంగా చివరి నిముషంలో ఓ జట్టు టాప్ 4లోకి ప్రవేశించడం అనేది ఐపీఎల్ లో రొటీన్ గా జరిగే విషయమే!