Chennai - Super KingsChennai - Super Kingsఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. ముంబై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ – చెన్నై సూపర్ కింగ్స్ తలపడిన ఈ మ్యాచ్ లో చివరి మూడు ఓవర్లలో మ్యాచ్ ను మలుపు తిప్పి చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 140 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు 8 వికెట్లు కోల్పోయిన చెన్నై, 19.1 ఓవర్లలో సాధించింది.

17 ఓవర్లు ముగిసే సమయానికి కేవలం 97 పరుగులు మాత్రమే చేసి క్లిష్ట పరిస్థితులలో చెన్నై ఉంది. పిచ్ స్వభావం, హైదరాబాద్ బౌలింగ్ చేస్తోన్న రీత్యా సన్ రైజర్స్ విజయం దాదాపుగా ఖరారైంది. కానీ ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. బ్రాత్ వైట్ వేసిన 18వ ఓవర్లో ఏకంగా 20 పరుగులు రాబట్టగా, సిద్ధార్థ్ కౌల్ వేసిన 19వ ఓవర్లో 17 పరుగులు చెన్నై చేసింది. ఇక ఫైనల్ ఓవర్లో 6 పరుగులు రావాల్సి ఉండగా, మొదటి బంతికే డుప్లేసిస్ సిక్సర్ కొట్టి విజయాన్ని అందించాడు.

ఇలా చివరి మూడు ఓవర్లలో మ్యాచ్ ను మలుపు తిప్పడం చెన్నైకు ఇదేమి కొత్తకాదు. ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో కూడా ముంబైతో చివరి 2.5 ఓవర్లలో 47 పరుగులు చేయగా, కోల్ కతాతో చివరి 2.5 ఓవర్లలో 41 పరుగులు, బెంగుళూరుతో 2.4 ఓవర్లలో 44 పరుగులు, తాజాగా 2.1 ఓవర్లలో 43 పరుగులు చేసి వీక్షకులను అవాక్కు చేసారు. లీగ్ లో ఉన్న ఎనిమిది జట్లల్లో ఇలా చేయడం ఒక్క చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రమే సాధ్యమవుతోంది.

పాల్గొన్న 9 సీజన్లలో తొమ్మిదింటికి ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయిన జట్టుగా కూడా చెన్నై ట్రాక్ రికార్డ్ బలంగా ఉంది. అలాగే ఇప్పటికే రెండు సార్లు కప్ కైవసం చేసుకున్న చెన్నై, మూడవ కప్ కోసం 7వ సారి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. మరి ఫైనల్ లో ఏ జట్టుతో నాటకీయ పరిణామాలను చెన్నై ఆడిస్తుందో చూడాలి. అంతా మహేంద్ర సింగ్ ధోని మాయాజాలం అని అనుకోవడం చెన్నై అభిమానుల వంతు! మొదటి 35 బంతుల్లో 41 పరుగులు చేసిన డుప్లేసిస్, తన తదుపరి 7 బంతుల్లో 26 పరుగులు చేయడమేంటి వింత, విడ్డూరం కాకపోతేనూ అనుకోవడం సన్ రైజర్స్ ఫ్యాన్స్ వంతు!