IPL 2018 Eliminator Kolkata Knight Riders vs Rajasthan Royalsనాడు కవి ఏ ఉద్దేశంతో రాసారో గానీ, ప్రస్తుతం ఐపీఎల్ కు ఈ పాట చక్కగా సూట్ అవుతుంది. ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు’ అని పాడుకోవడం క్రికెట్ అభిమానుల వంతవుతోంది. సినిమా స్క్రిప్ట్ లో కూడా ఇన్ని మలుపులు ఉంటాయో లేదో గానీ, ఐపీఎల్ లో మాత్రమే మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతూ… ఫైనల్ ఓవర్స్ కు చేరుకునే సమయానికి విజయం సాధిస్తుందన్న జట్టు కాకుండా అనూహ్య పరిణామాలతో మరొక జట్టు విజయం సాధించడం పరిపాటిగా మారిపోయింది.

కోల్ కతా వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ ఇందుకు మినహాయింపు కాదని మరోసారి రుజువు చేసింది. మొదటి ప్లే ఆఫ్స్ లో చివరి రెండు ఓవర్లలో చెన్నై ఎలా అయితే మ్యాచ్ ను తమ వైపుకు తిప్పుకుందో, కోల్ కతా కూడా చివరి ఓవర్లలో తమ పదునైన బౌలింగ్ తో మ్యాచ్ ను సొంతం చేసుకుని రాజస్తాన్ ను ఎలిమినేట్ చేసి, శుక్రవారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో అమీతుమీ తేల్చుకోబోతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా, 169 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను నమోదు చేసుకుంది.

ఈ లక్ష్య చేధనలో 14 ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 109 పరుగులు చేసి హాట్ ఫేవరేట్ గా ఉంది. కానీ ఇక్కడే మొదలైంది ట్విస్ట్ ల కధ. ఆ తర్వాత ఓవర్ మొదటి బంతికి రెహనే అవుట్ కావడం, చివరికి లక్ష్యానికి 25 పరుగుల దూరంలో రాజస్తాన్ నిలిచిపోవడం అన్నీ అలా జరిగిపోయాయి. చివరి 6 ఓవర్లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేసారంటే రాజస్తాన్ జట్టు ఏ రేంజ్ లో బ్యాటింగ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ చివరి 10 ఓవర్లు అదరగొట్టి మ్యాచ్ ను సొంతం చేసుకుంది కోల్ కతా.