IPL 2018-Chennai Super Kings vs Mumbai Indiansఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 హంగామా మొదలైంది. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యమైన విజయాన్ని నమోదు చేసుకుంది. రెండవ ఇన్నింగ్స్ 14 ఓవర్ల వరకు ముంబై ఇండియన్స్ తరపున ఉన్న మ్యాచ్ కాస్త నాటకీయ పరిణామాల నేపధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మలుపు తిరిగింది.

కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఇలా జరుగుతుందా? అనిపించే విధంగా జరిగిన మ్యాచ్ లో డ్వేన్ బ్రావో (30 బంతుల్లో 68 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో గౌరవప్రదమైన 165 పరుగులు చేసింది.

లక్ష్య చేధనలో 105 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన చెన్నై, దాదాపుగా పరాజయాన్ని ఖాయం చేసుకుంది. కానీ క్రీజులో ఉన్న బ్రావో, ముంబై టాప్ బౌలర్లైన బూమ్రా, ముస్తాఫీజుర్ లపై విరుచుకుపడుతూ చివరి 5 ఓవర్లలో ఏకంగా 61 పరుగులు రాబట్టి చెన్నైను విజయాన్ని సమకూర్చారు. మ్యాచ్ అంతా ముగిసిన తర్వాత ఐపీఎల్ లో ఇలా జరగడం సహజమే కదా అనుకోవడం క్రికెట్ ప్రేమికుల వంతు!