IPL 2017 Sunrisers Hyderabad vs Kolkata Knight Ridersహైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో… టాప్ చైర్ లో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు సన్ రైజర్స్ భారీ షాక్ ఇచ్చింది. ఈ సీజన్ లో వరుసగా విజయాలు సాధిస్తూ… తిరుగులేని జట్టుగా ఎదిగిన కోల్ కతా హాట్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగగా, చివరికి వార్నర్ విధ్వంసంతో ‘వార్ వన్ సైడ్’ అయిపోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతాకు హైదరాబాద్ ఓపెనర్లు 12.4 ఓవర్లలో 139 పరుగుల సాధించి, తమ ఉద్దేశం ఏమిటో చెప్పకనే చెప్పారు.

ఈ ఓపెనింగ్ భాగస్వామ్యంలో ధావన్ చేసిన పరుగులు కేవలం 29 మాత్రమే. దీంతో వార్నర్ ఏ రేంజ్ లో చెలరేగిపోయాడో అర్ధం చేసుకోవచ్చు. 43 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వార్నర్, మొత్తమ్మీద 59 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 126 పరుగులు చేసి హైదరాబాద్ 209 పరుగుల భారీ స్కోర్ సాధించడానికి కారణమయ్యాడు. అయితే ఈ సీజన్ లో కోల్ కతా భారీ లక్ష్యాలను కూడా అవలీలగా చేధించడంతో, మ్యాచ్ చాలా ఆసక్తికరంగా జరుగుతుందని భావించారు.

కానీ, రెండవ ఓవర్ నుండే మొదలైన వికెట్ల పతనంతో వార్ వన్ సైడ్ గా మారిపోయింది. ఏ స్థాయిలోనూ హైదరాబాద్ కు పోటీ ఇచ్చే దిశగా కోల్ కతా ఇన్నింగ్స్ సాగలేదు. ఈ సీజన్ లో అద్భుతమైన ఫాంలో ఉన్న ఊతప్ప ఒక్కడే 28 బంతుల్లో 53 పరుగులు చేయగా, మనీష్ పాండే 39 పరుగులతో తన వంతు ప్రయత్నం చేసాడు. ఇక మిగతా బ్యాట్స్ మెన్లంతా ఒత్తిడితో పెవిలియన్ చేరుకోవడంతో, నిర్ణీత ఓవర్లలో 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో 10 మ్యాచ్ లలో 13 పాయింట్లు సాధించి 3వ స్థానంలో నిలిచింది సన్ రైజర్స్.

ఈ ఓటమితో కోల్ కతాకు పెద్దగా చేకూరే నష్టం లేకపోయినప్పటికీ, నైట్ రైడర్స్ వరుస విజయాలకు హైదరాబాద్ బ్రేకులు వేసింది. ఇప్పటికీ కోల్ కతా 1వ స్థానంలోనే ఉండగా, ముంబై 2, పూణే 4వ స్థానాలలో నిలిచాయి. ఇక, ఈ సీజన్ లో టాప్ స్కోరర్ కొనసాగుతున్న గౌతమ్ గంభీర్ స్థానాన్ని కూడా ‘ఆరంజ్’ క్యాప్ తో వార్నర్ కబ్జా చేసాడు. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించడానికి వీవీఎస్ లక్ష్మణ్ లతో కలిసి ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ మైదానంలో సందడి చేసాడు.