IPL 2017 Royal Challengers vs Kings XIప్రపంచ క్రికెట్ లో రికార్డులకు రారాజుగా నిలిచిన సచిన్ టెండూల్కర్ తర్వాత, ఆ స్థాయిలో రికార్డులను కొల్లగొట్టే సత్తా ఉన్న క్రికెటర్ గా అభిమానుల చేత, క్రీడా పండితుల చేత కితాబు అందుకున్న విరాట్ కోహ్లికున్న క్రేజ్ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విరాట్ నేతృత్వం వహిస్తున్నందు వలనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు విశేషమైన ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఈ సీజన్ లో వరుసగా దారుణ పరాజయాలు చవిచుస్తూ, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఈ సీజన్ లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుండి వెనుదిరగడంతో బెంగుళూరు జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదు. దీంతో ఇలాంటి మ్యాచ్ లోనైనా స్థాయికి తగిన ప్రతిభ కనపరిచి, అభిమానులను ఆకట్టుకుంటారని భావిస్తే, వారి ఆశలపై నీళ్ళు జల్లడం కాదు గానీ, ఏకంగా ఆశలను చంపేసే విధంగా యాసిడ్ జల్లుతోంది ‘కోహ్లి అండ్ కో.’ తాజాగా కింగ్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేవలం 139 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకోలేక, 119 పరుగులకే ఆలౌట్ అయ్యి, మరోసారి తీవ్రంగా నిరాశ పరిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు, అక్సర్ పటేల్ బ్యాట్ కు పని చెప్పడంతో కనీసం ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. కానీ స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక తొలి ఓవర్ నుండే వికెట్లను కోల్పోతూ వచ్చింది. గేల్ (0), కోహ్లి (6), డివిలియర్స్ (10), జాదవ్ (6), వాట్సన్ (3) ఇలా పోటీలు పడి మరీ ఒకరి వెంట మరొకరు పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ మనదీప్ సింగ్ ఒక్కడే 46 పరుగులతో రాణించగా, ఆ మొత్తం లక్ష్య చేధనలో ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో వరుసగా 5వ ఓటమిని చవిచూసి ‘డబుల్ హ్యాట్రిక్’కు సిద్ధంగా ఉంది.

ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను కింగ్స్ ఎలెవన్ జట్టు సజీవంగా ఉంచుకోగలిగింది. ఆడిన 10 మ్యాచ్ లలో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించగా, మిగిలిన 4 మ్యాచ్ లలో ఖచ్చితంగా మూడింటిలో విజయం సాధిస్తే… ప్లే ఆఫ్స్ లో పంజాబ్ నిలిచినట్లే. మరో వైపు ఆడిన 12 మ్యాచ్ లలో కేవలం రెండంటే రెండు విజయాలతో చిట్టచివరి స్థానం తనదే అంటూ… మరో జట్టు పోటీ పడడానికి ఆస్కారం లేకుండా నిలిచింది కోహ్లి సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు.