ipl-2017-mumbai-indians vs rising-pune-supergiantలీగ్ మ్యాచ్ లలో అత్యధిక విజయాలు సాధించి అగ్ర స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, కీలకమైన మ్యాచ్ లో చేతులెత్తేసింది. ముంబై వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను చిత్తుగా ఓడించి, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ ఏడాది జరిగిన రెండు లీగ్ మ్యాచ్ లలోనూ ముంబైపై జయకేతనాన్ని ఎగురవేసిన పూణే జట్టు, అదే ఒరవడిని కొనసాగిస్తూ క్వాలిఫైయర్ మ్యాచ్ లో కూడా ముంబైకు గట్టి షాక్ నే ఇచ్చారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఆరంభంలో అదరగొట్టింది. తొలి ఓవర్లోనే త్రిపాఠి, రెండవ ఓవర్లో స్మిత్ వికెట్లను పడగొట్టి పూణే వేగాన్ని ముంబై బౌలర్లు నియంత్రించగలిగారు. ఈ తరుణంలో క్రీజులో స్థిరపడ్డ రెహానే (56), మనోజ్ తివారీ (58) పరుగులతో రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ ఖాయంగా కనపడింది. కానీ, చివర్లో క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని (40), ఆఖరి రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 150 పరుగులు కూడా కష్టమనుకున్న తరుణంలో మెక్ లింగన్ వేసిన 19వ ఓవర్లో 26 పరుగులు, బూమ్రా వేసిన 20వ ఓవర్లో 15 పరుగులు రాబట్టి పూణే ఇన్నింగ్స్ ను 162 పరుగుల వద్ద ముగించాడు.

అయితే ఈ సీజన్లో 200 పరుగులను కూడా అవలీలగా కొట్టిన ముంబై ఇండియన్స్ కు ఇదేమీ పెద్ద లక్ష్యం కాదని భావించిన అభిమానులకు ముంబై బ్యాట్స్ మెన్లు ఒక్కొక్కరిగా షాక్ ఇచ్చారు. తొలి వికెట్ కు 35 పరుగులు జోడించిన తర్వాత దురదృష్టవశాత్తూ సిమ్మన్స్ రనౌట్ కావడంతో ప్రారంభమైన పతనం, మ్యాచ్ ను ముంబై నుండి దూరం చేసింది. ఆ తర్వాత ఓవర్లో ఎంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయానికి ఎల్బీడబ్ల్యూ రూపంలో రోహిత్ శర్మ బలవ్వగా, అదే ఓవర్లో రాయుడు ప్రదర్శించిన అత్యుత్సాహానికి స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ముంబై బ్యాట్స్ మెన్లకు వాషింగ్టన్ సుందర్ భారీ షాక్ ఇచ్చాడు.

ఇలా ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ చేరడానికి క్యూ కడుతున్న సమయంలో మ్యాచ్ ను ముంబైకు తిప్పడం కోసం ఓపెనర్ పార్థీవ్ పటేల్ మరో ఎండ్ నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసిన పార్థివ్, స్కోర్ బోర్డు 103 పరుగుల వద్ద 7వ వికెట్ గా వెనుదిరగడంతో మ్యాచ్ పై ముంబై అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. దీంతో ఈ సీజన్లో బ్యాటింగ్ చేయడానికి కష్టపడుతున్న రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురుస్తోంది. పార్థీవ్ పటేల్ మినహా మిగతా బ్యాట్స్ మెన్లు సిమ్మన్స్ (5) రోహిత్ (1), రాయుడు (0), పొల్లార్డ్ (7), పాండ్య (14), కృనాల్ (15) అంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు.

అయితే ఈ మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ, ముంబై ఫైనల్ కు చేరడానికి చేతిలో మరో అవకాశం ఉంది. నేడు జరగనున్న ‘ఎలిమినేటర్ మ్యాచ్’లో సన్ రైజర్స్ హైదరాబాద్ – కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనుండగా, ఇందులో విజయం సాధించిన జట్టుతో రెండవ క్వాలిఫైయర్ లో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఒత్తిడి ఉండే మ్యాచ్ లలో తడబడడం ముంబై ఇండియన్స్ కు పరిపాటిగా మారిన నేపధ్యంలో… రెండవ క్వాలిఫైయర్ లో అయినా గానీ సత్తాకు తగిన విధంగా ప్రదర్శన ఇవ్వడం కలగానే భావించాలి. ముఖ్యంగా ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శకులు, ముంబై అభిమానులు మండిపడుతున్నారు.