IPL Final 2017 Mumbai Indians beat Rising Pune Supergiant in final లీగ్ మ్యాచ్ లలో పూణే చేతిలో రెండు సార్లు భంగపాటు… ప్లే ఆఫ్స్ లో మళ్ళీ పూణే చేతిలోనే ఖంగు… అయినప్పటికీ మళ్ళీ పూణేతోనే ఫైనల్… ఫస్ట్ బ్యాటింగ్… కేవలం 128 పరుగుల స్కోర్… ఇది క్లుప్తంగా పూణేకు ఎదురుగా నిలిచిన ముంబై జట్టు తీరు. ఇక లక్ష్య చేధనలో పూణే 10 ఓవర్లకు 62/1… విజయం సాధించాలంటే 60 బంతుల్లో 67 పరుగులు… చేతిలో 9 వికెట్లు… క్రీజులో పాతుకుని పోయిన రెహానే, స్మిత్… పెవిలియన్ ఎండ్ లో ధోని, తివారీ, క్రిష్టియన్ వంటి అరవీర భీకర హిట్టర్లు… ఇలా ఉండగా ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుందని ఎవరైనా అనుకున్నారా..?

కానీ అదే జరిగింది. బహుశా మ్యాచ్ పూణే గెలిచేస్తుందని భావించిన అమితాబ్ బచ్చన్ వంటి ముంబై ఇండియన్స్ అభిమానులు, మ్యాచ్ సగంలోనే టీవీలు స్విచ్ ఆఫ్ చేసిన వారికి షాక్ ఇచ్చే విధంగా ఉత్కంఠ పోరులో 1 పరుగుతో విజయం సాధించి ఐపీఎల్ కప్ ను మూడవ సారి ఎగరేసుకుపోయింది. ఈ విజయం సాధించడంలో ముంబై బౌలర్స్ కనపరచిన ప్రతిభ అనన్య సామాన్యం. ముఖ్యంగా బూమ్రా వేసిన ఓవర్లు అద్భుతం అనే చెప్పాలి. అలాగే మలింగ కూడా చక్కని తోడ్పాటు ఇవ్వగా, చివరి ఓవర్ లో మిచెల్ జాన్సన్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేసి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

చివరి ఓవర్లో 11 పరుగులు విజయానికి అవసరం కాగా, మొదటి బంతికే మనోజ్ తివారీ బౌండరీ సాధించడంతో… 5 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో పూణే విజయం తధ్యం అని భావించగా, మరుసటి బంతికి తివారీ పెవిలియన్ కు చేరుకోగా, అప్పటివరకు క్రీజులో నిలదొక్కుకుని ఉన్న కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ను కూడా జాన్సన్ అవుట్ చేసి మ్యాచ్ ను ముంబై వైపుకు తిప్పాడు. ఈ తరుణంలో పార్థీవ్ ఒక రనౌట్ ను మిస్ చేయగా, మరో బంతికి హార్దిక్ పాండ్య క్యాచ్ ను మిస్ చేసాడు. దీంతో చివరి బంతికి 4 పరుగులు కావాల్సి ఉండగా, 2 పరుగులు మాత్రమే చేయగలిగింది పూణే జట్టు.

మ్యాచ్ ను చూడని వారు మాత్రం ఈ విషయం తెలుసుకుని ‘ముంబై ఎలా గెలిచింది?’ అంటూ అమితాబ్ మాదిరి అవాక్కయ్యే భావాన్ని పలికిస్తున్నారు. అయితే అభిషేక్ మాదిరి ఎవరో ఒకరు ఫోన్ చేసిన తర్వాత ‘నిజమా!’ అంటూ సంబరపడం ముంబై ఇండియన్స్ అభిమానుల వంతయ్యింది. మూడు సార్లు ఐపీఎల్ కప్ అందుకున్న కెప్టెన్ గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డును సాధించాడు. ఊహించని ఈ విజయంతో ముంబై క్యాంప్ లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ‘క్రికెట్ గాడ్’ సచిన్ తో సహా అందరూ ఈ విజయాన్ని తనివితీరా ఆశ్వాదించారు.