IPL 10 - Royal Challengers VS Mumbai Indiansఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక్కో జట్టుకు ఒక్కో చరిత్ర ఉంది. అయితే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లకు మాత్రం ఒకే రకమైన చరిత్ర ఉంది. పేపర్ పైన బలంగా ఉన్న ఈ జట్లు, ఐపీఎల్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఖచ్చితంగా ఇంటి ముఖం పడతాయని అంతా భావిస్తారు. కానీ, లీగ్ మ్యాచ్ లన్నీ ముగిసే సమయానికి ప్లే ఆఫ్స్ లో ఉండే నాలుగు జట్లల్లో ఈ రెండు ఖచ్చితంగా స్థానం సంపాదిస్తాయి. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లలో ఓటమి పాలు కావడం, తీరా పీక మీద కత్తి పెట్టే సమయానికి అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడం ముంబై, బెంగుళూరు జట్లకు పరిపాటిగా మారుతోంది.

ఇప్పటివరకు బెంగుళూరు మూడు మ్యాచ్ లు ఆడగా, కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. నిజానికి బెంగుళూరు బ్యాటింగ్ లైనప్ చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. అంతటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ను ఉంచుకుని కూడా, భారీ స్కోర్లు చేయలేక చతికిలపడి ఓటమిని కొనితెచ్చుకుంటోంది. మరో వైపు ముంబై ట్రాక్ రికార్డు కూడా ఇందుకు విరుద్ధమేమీ కాదు. పేపర్ పై అత్యంత స్ట్రాంగ్ గా ఉన్న టీంలలో ముంబై కూడా ఒకటి. కానీ, ఫీల్డ్ విషయానికి వస్తే ఒత్తిడితో ఎప్పుడూ సతమతమవుతూ ఉంటుంది.

ఇప్పటివరకు జరిగిన 9 ఐపీఎల్ లలో ఆరేడు సీజన్లలో ఈ రెండు జట్ల పరిస్థితి ఇంతే. ఏదో ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే ఆది నుండి అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాయి. అయితే ఈ సారి ఐపీఎల్ లో కూడా ఇలాగే నెట్టుకొచ్చేద్డామని భావిస్తే, భంగపాటుకు గురి కాక తప్పదని క్రీడా పండితులు చెప్తున్నారు. ఈ సీజన్ లో దాదాపుగా అన్ని జట్ల బలాబలాలు ఒకే విధంగా ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే, ముంబై, బెంగుళూరులను మించిపోయే విధంగానే ఇతర జట్లు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

ఫస్టాఫ్ లో ఎలాగోలా ఆడేసి, సెకండాఫ్ లో చూసుకుందామంటే, ఈ సారి ఆ పప్పులు ఉడకవని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ముఖ్యంగా అంతకు ముందు ఐపీఎల్స్ లో బాగా వీక్ గా అనిపించిన పంజాబ్, పూణే, ఢిల్లీ జట్లు ఎంతో బలంగా కనపడుతున్నాయి. దీంతో ప్రతి మ్యాచ్ ను సీరియస్ తీసుకొని పక్షంలో, ఈ ముంబై, బెంగుళూరు జట్ల అభిమానులకు నిరాశ తప్పదని భావిస్తున్నారు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న విరాట్ కోహ్లి సేవలు బెంగుళూరుకు అందించాల్సిన సమయం ఆసన్నమైనట్లుగా కనపడుతోంది.