IPL 10 RCB VS Mumbai Indiansబెంగుళూరు వేదికగా జరిగిన అద్భుతమైన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు అమోఘమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ సాధించిన ‘హ్యాట్రిక్’ విజయాలలో ఇది ‘ది బెస్ట్’గా కితాబు ఇవ్వవచ్చు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు, బెంగుళూరును కేవలం 142 పరుగులకే పరిమితం చేసింది. గేల్ 22 పరుగులకు అవుట్ కాగా, ఈ సీజన్ లో ఫస్ట్ టైం బరిలోకి దిగిన విరాట్ కోహ్లి 47 బంతుల్లో 62 పరుగులు చేయడంతో బెంగుళూరు గౌరవప్రదమైన స్కోర్ ను నమోదు చేయగలిగింది.

స్వల్ప స్కోర్ కావడంతో అవలీలగా గెలిచేస్తుందని భావించిన ముంబై జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండవ ఓవర్లో 7 పరుగుల వద్ద ఓపెనర్ బట్లర్ వికెట్ కోల్పోయిన ముంబై జట్టు, ఆ తర్వాత ఓవర్ లో స్పిన్నర్ బద్రి హ్యాట్రిక్ సాధించడంతో 7 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో భారమంతా ఫాంలో ఉన్న రానాపై మరియు ఫాంలో లేని పొల్లార్డ్ పై పడింది. అయితే స్కోర్ బోర్డు 33 పరుగులకు చేరుకునే సమయానికి రానా కూడా పెవిలియన్ కు చేరడంతో, ఇక ముంబై పరాజయం లాంచనమే అని భావించారు.

కానీ, అందరికీ షాక్ ఇస్తూ పొల్లార్డ్ అద్భుతమైన బ్యాటింగ్ చేసాడు. వికెట్లు పడిపోయిన సమయంలో కాస్త నింపాదిగా ఆడిన పొల్లార్డ్, ఆ తర్వాత కావాల్సిన నెట్ రన్ రేట్ ను అంచనా వేస్తూ ఓవర్ కు ఓ సిక్స్ గానీ, బౌండరీ గానీ సాధిస్తూ ముంబై స్కోర్ బోర్డును కదిలించాడు. మరో ఎండ్ లో ఉన్న క్రునాల్ పాండ్య చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ 9.3 ఓవర్లలో 93 పరుగులు నమోదు చేయడంతో, మ్యాచ్ ముంబై వైపుకు తిరిగింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్!

సిక్సర్లు బాదుతూ ముంబైకు విజయాన్ని అందివ్వాలని భావించిన పొల్లార్డ్ మరో భారీ షాట్ కు ప్రయత్నించి, బౌండరీ లైన్ వద్ద డివిలియర్స్ కు దొరికిపోయాడు. దీంతో మళ్ళీ ఏమవుతుందో అనుకున్నప్పటికీ, ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా ‘పాండ్య బ్రదర్స్’ మ్యాచ్ ను విజయవంతంగా ముగించారు. పొల్లార్డ్ పేకాట లాంటి ఇన్నింగ్స్ తో ముంబై జట్టు కేవలం 18.5 ఓవర్లలోనే 145 పరుగులు చేసి, 6 పాయింట్లతో టేబుల్ లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.