IPL 10 Pune Vs Gujarat -Tripati Steven Smith Bowlingఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓటమి పాలు కావడంతో, ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ జట్టు కూర్పును మార్చింది. ఈ ఎత్తుగడ ఫలించి, అమోఘమైన విజయాన్ని అందిపుచ్చుకుంది. పూణేతో జరిగిన మ్యాచ్ లో చేసిన మార్పులన్నీ గుజరాత్ జట్టుకు ఎంతో దోహదం చేసాయి. ముఖ్యంగా ఆల్ రౌండర్ ఆండ్రూ టైను తీసుకోవడం, గుజరాత్ లయన్స్ ఫేట్ ను మార్చేసిందని చెప్పవచ్చు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ పై త్రిపాఠి, స్టీవెన్ స్మిత్ లు విరుచుకుపడుతున్న సమయంలో బౌలింగ్ కు దిగిన టై, తొలి ఓవర్ లోనే రాహుల్ త్రిపాఠిని పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత ప్రమాదకరంగా మారుతున్నట్లు కనిపించిన బెన్ స్టోక్స్ ను బౌల్డ్ చేసి పూణేను చావుదెబ్బ తీసాడు. ఇక, చివరి ఓవర్ లో అయితే తొలి మూడు బంతులకు మూడు వికెట్లు తీసి, ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ లోనే ‘హ్యాట్రిక్’ నమోదు చేసాడు.

దీంతో 5 వికెట్లు సొంతం చేసుకున్న టైకు మరో వికెట్ కూడా దక్కి ఉండేది. చివరి బంతికి రవీంద్ర జడేజా క్యాచ్ ను జారవిడవడంతో 6వ వికెట్ దక్కకుండా పోయింది. మొత్తంగా 4 ఓవర్లు వేసిన టై 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇక 172 పరుగుల లక్ష్యంలో ఎలాంటి ట్విస్ట్ లకు తావు లేకుండా ఓపెనర్లు స్మిత్ 47, మెక్కల్లం 49 పరుగులతో విరుచుకుపడగా, మిగిలిన తంతును రైనా, ఫించ్ లు పూర్తి చేసారు. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది.