IPL 10 Mumbai Indiansఐపీఎల్ సీజన్ 10లో ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ సీజన్ లో ఇప్పటికే టోర్నీ నుండి అవుట్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తన విజయపరంపరను కొనసాగించింది. మొత్తం 10 మ్యాచ్ లు ఆడిన ముంబై, రెండు సార్లు పూణే చేతిలో ఓడి 8 సార్లు జయకేతనం ఎగురవేసి 16 పాయింట్లతో టాప్ చైర్ ను కైవసం చేసుకుంది. చేతిలో ఇంకా 4 మ్యాచ్ లు మిగిలి ఉండగా, అందులో ఒకటి, రెండు గెలిస్తే నెంబర్ 1 స్థానం ముంబైదే అని చెప్పవచ్చు.

మరో వైపు ఈ ఏడాది అత్యంత దయనీయమైన ప్రదర్శన ఇస్తోన్న బెంగుళూరు జట్టు అదే ఒరవడిని కొనసాగిస్తోంది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ యధావిధిగా విఫలమై, 162 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ వద్ద ముగించారు. కోహ్లి విఫలం కాగా, డివిలియర్స్ 43 పరుగులతో పర్వాలేదనిపించాడు. చివర్లో పవన్ నేగి బ్యాట్ జులిపించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా నమోదు చేయగలిగింది. ముంబై బౌలర్లలో మెక్ లింగన్ 3 వికెట్లు సొంతం చేసుకుని సత్తా చాటాడు.

ఇక లక్ష్య చేధనలో మొదటి బంతికే వికెట్ కోల్పోయిన ముంబైను బట్లర్ (33), రానా (27)లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఔటైన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, ముంబైను విజయతీరాలకు చేర్చాడు. పొల్లార్డ్ త్వరగానే ఔటైనప్పటికీ, హార్దిక్ పాండ్య మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ముఖ్యంగా గత మ్యాచ్ లో లేనిపోని షాట్లను ఆడి వికెట్లు పారేసుకున్న ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్లు, ఈ మ్యాచ్ లో ఆ తప్పును రిపీట్ చేయకుండా జాగ్రత్త పడడంతో, 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది.