IPL 10 Dhoni Pune VS SRHదాదాపుగా ఒకటి, రెండు సంవత్సరాలుగా మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ తీరు అభిమానులతో సహా క్రికెట్ ప్రేమికుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ ల సంగతి పక్కన పెడితే, ఇటీవల మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ధోని బ్యాటింగ్ పరిస్థితి ఇంతే. ఈ మ్యాచ్ లోనైనా స్థాయికి తగిన విధంగా ప్రతిభ కనపరుస్తాడని భావిస్తున్న క్రికెట్ ప్రేమికులను నిరాశపరిచిన ధోని, ఎట్టకేలకు తన రేంజ్ షాట్లతో విరుచుకుపడుతూ పూణేకు కీలక విజయాన్ని అందించాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్ష్య చేధనలో ధోని తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చివరి బంతికి ఫోర్ కొట్టి… 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు ధోని. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 176 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను నమోదు చేసింది. వార్నర్ 43, ధావన్ 30, విలియమ్సన్ 21 పరుగులు చేయగా, చివర్లో హేన్రిక్స్ 28 బంతుల్లో 55 పరుగులు చేసి హైదరాబాద్ కు మంచి స్కోర్ ను అందించారు.

ఇక, లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆదిలోనే రెహానే వికెట్ ను కోల్పోయిన పూణేను మరో ఓపెనర్ త్రిపాఠి ఆదుకున్నాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి ఐపీఎల్ లో తన మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. స్మిత్ 27 పరుగులకే ఔటైనప్పటికీ, ధోని మాత్రం కీలకమైన మ్యాచ్ లో తన సత్తా చాటాడు. చివరి 4 ఓవర్లలో 58 పరుగులు చేయాల్సి ఉండగా, ధోని వీర కుమ్ముడుతో పూణే విజయవంతంగా ముగించింది. దీంతో ఆడిన 6 మ్యాచ్ లలో 3 గెలుపులు, 3 ఓటములతో 6 పాయింట్లతో నాలుగవ స్థానానికి చేరుకుంది పూణే.